JAGAN TRIBUTES:తన తండ్రి,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు భార్య భారతితో కలిసి వచ్చిన ఆయన.. తన తండ్రి సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి వచ్చి.. తండ్రికి అంజలి ఘటించారు.
జిల్లాలో రెండ్రోజుల పర్యటనను ముగించుకున్న జగన్.. ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నివాళులు అర్పించక ముందు.. ఆ తర్వాత కానీ.. జగన్, షర్మిల ఒకరినొకరు పలకరించుకోలేదు. కార్యక్రమం పూర్తైన తర్వాత ఎవరికి వారు ఘాట్ నుంచి వెళ్లిపోయారు.