తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం దిల్లీ వెళ్లి (TDP DELHI TOUR) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమయమిచ్చినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఐదుగురు నేతలకు సమయమిచ్చినట్లు వెల్లడించాయి. మాదకద్రవ్యాలకు, గంజాయికి రాష్ట్రం అడ్డాగా మారిందని, ప్రభుత్వంలోని వ్యక్తులే దాన్ని ప్రోత్సహిస్తున్నారని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న తెదేపా.. అదే విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్రపతి పాలన విధించాలని కోరనుంది.
చంద్రబాబు ఈ ఉదయం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రపతితో భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలతోపాటు భవిష్యత్ కార్యాచరణపైనా చర్చించారు. సోమ, మంగళ వారాల్లో పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు.