Big Investments in Telangana: రాష్ట్రంలో సౌరవిద్యుత్ పరికరాల ఉత్పత్తి, విద్యుత్ వాహనాల రంగాల్లో మరో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మూడు సంస్థలు నిర్ణయించాయి. అమెరికాకు చెందిన అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, భారత్‌కు చెందిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూపులు సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్ సిటీలో రూ.700 కోట్లతో సోలార్‌సెల్, మాడ్యూల్‌ల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీని ద్వారా మూడు వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ రెండు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పత్రాలను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం అందజేశారు. యూఏఈకి చెందిన మెటా4 సంస్థ రూ.250 కోట్లతో జహీరాబాద్‌లో ద్విచక్ర విద్యుత్ వాహనాల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించింది.
ప్రీమియర్, అజ్యూర్‌ల సౌర విద్యుత్ పరిశ్రమ :హైదరాబాద్‌లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ సిటీలో ప్రీమియర్ ఎనర్జీ పరిశ్రమను నిర్వహిస్తోంది. కొత్తగా 1.25 గిగావాట్ల సోలార్‌సెల్, 1.25 గిగావాట్ల మాడ్యూళ్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై ‘ప్రీమియర్’తో అజ్యూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిష్ఠాత్మక సంస్థలు తెలంగాణకు తరలిరావడం రాష్ట్రంలోని స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలకు నిదర్శనం. సౌరవిద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. కొత్త పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్నవాటి ద్వారా పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. రెండు సంస్థలకూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం’’ అని తెలిపారు. తెలంగాణలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సోలార్ మాడ్యూల్, సెల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెస్తుందని అజ్యూర్ పవర్ గ్లోబల్ ఛైర్మన్ అలన్ రోస్లింగ్ తెలిపారు. తెలంగాణను సౌరవిద్యుత్ ఉత్పత్తుల హబ్‌గా మార్చేందుకు తమ పరిశ్రమలు సహకరిస్తాయని ప్రీమియర్ ఎనర్జీ ఛైర్మన్ సురేందర్‌పాల్ సింగ్, ఎండీ చిరంజీవ్ సలూజా తెలిపారు.