ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఏపీ సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. దాదాపు గంటకుపైగా సమావేశం జరిగింది. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవు. విశాఖ ఉక్కు పరిశ్రమ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ప్రైవేటీకరణ కాకుండా ఒత్తిడి తెస్తున్నాం. అందరం కలిసి దిల్లీ పెద్దలను పరిశ్రమకు సానుకూలంగా మారుద్దాం. స్టీల్‌ప్లాంట్‌కు దాదాపు 20 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఉపయోగించని భూమి కనీసం 7 వేల ఎకరాలు ఉంటుందని అంచనా. ప్రభుత్వం నుంచి ల్యాండ్ యూజ్ కన్వర్షన్‌కు అనుమతి ఇస్తాం. ల్యాండ్ యూజ్ కన్వర్షన్‌కు ప్రభుత్వం నుంచి అభ్యంతరం ఉండదు. ల్యాండ్ యూజ్ కన్వర్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. భూమిని ప్లాట్లు, లేఅవుట్లు వేసి స్టీల్‌ప్లాంట్‌తోనే విక్రయించాలి. వచ్చిన డబ్బును స్టీల్‌ప్లాంట్‌లోనే పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల పరిశ్రమలో ఒకేసారి నగదు నిల్వలు పెరుగుతాయి. ఇవన్నీ అమలైతే ప్రైవేటువారికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ చేస్తే ప్రభుత్వ రంగంలోనే స్టీల్‌ప్లాంట్ ఉంటుంది- ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.