తెలంగాణ

telangana

ETV Bharat / city

Indian Students in Ukraine : అక్కడ పిల్లలు.. ఇక్కడ తల్లిదండ్రులు.. అంతా టెన్షన్ టెన్షన్​

Indian Students in Ukraine : బాంబుల వర్షం నుంచి తప్పించుకుని బతుకుజీవుడా అంటూ స్వదేశానికి ఎలా తిరిగి రావాలో అర్థంకాని అయోమయస్థితిలో విద్యార్థులు..కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డలకు ఏమవుతుందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు..యుద్ధ వాతావరణంతో పిల్లల్లో గుబులు..నిస్సహాయస్థితిలో తల్లిదండ్రులు..! ఇలా.. ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి..! తమ కన్నబిడ్డల్ని ఇళ్లకు రప్పించాలంటూ.. వారి తల్లిదండ్రులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

Indian Students in Ukraine
Indian Students in Ukraine

By

Published : Feb 26, 2022, 9:55 AM IST

Indian Students in Ukraine: భారీ శబ్దాలతో విరుచుకుపడుతున్న రాకెట్లు, బాంబుల నుంచి రక్షణకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగు విద్యార్థులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఏ క్షణానా ఎటు నుంచి ఆపద తరుముకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వారి పరిస్థితిని తలుచుకుంటూ ఇక్కడ తల్లిదండ్రులు విలవిలలాడిపోతున్నారు.

క్షణమొక యుగం..

Russia Ukraine War : ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన విజయరాఘవ చదువు పూర్తిచేసుకుని ఇంకో వారం రోజుల్లో స్వస్థలానికి రానున్నారు. ఈ సమయంలో యుద్ధం తరుముకురావడంతో అక్కడే చిక్కుకుపోయాడు. టీవీలో వార్తలు చూస్తున్న కుటుంబసభ్యులు....తీవ్రంగా విలపిస్తున్నారు.

రవాణా సాధనాలు లేక

Russia Ukraine War Updates :మండలంలోని తిమ్మాయపాలెంకు చెందిన అల్లంనేని విజయరాఘవ రెండు నెలల్లో చదువు పూర్తిచేసుకొని ఇంటికి రావాల్సి ఉంది. అక్కడినుంచి మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయంతో ఇక్కడివారు మాట్లాడుతున్నారని, అప్పటి వరకు బయటకు రావద్దని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పినట్లు వివరించారు.తల్లిదండ్రులు కాశయ్య, అనురాధ, చెల్లెలు రక్షితకు చరవాణి ద్వారా ప్రస్తుతం రాఘవ అందుబాటులో ఉన్నారు. వారు టీవీలో అక్కడి సంగతులు తెలుసుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

స్వస్థలాలకు చేరుకుంటాం

AP Students in Ukraine :ఉక్రెయిన్‌లోని జపోర్జియా, డ్నిప్రో, కర్కివ్, తదితర ప్రాంతాల్లో ఉన్న జిల్లా విద్యార్థులు మాట్లాడుతూ అక్కడి విషయాలు పంచుకున్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న పాటిబండ్ల హరిబాబు కుమారుడు యశ్వంత్‌ వైద్యవిద్య 5వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకా ఏడాదన్నర వరకు ఉక్రెయిన్‌లో ఉండాల్సి ఉందని చెప్పారు. తల్లిదండ్రులతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నానని, తాను ధైర్యంగా ఉన్నానన్నారు.్ర ఒంగోలుకు చెందిన సంపంగి వెంకటేశ్‌ కుమారుడు కల్యాణ్‌చక్రవర్తి జపోర్జియాలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. తాను వసతిగృహంలో ఉంటున్నానని, భారత్‌ ఎంబసీ నుంచి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

సెల్‌ టవర్లు ధ్వంసమయ్యాయి

Telugu Students in Ukraine :లాయర్‌పేట సాయిబాబా దేవాలయం సమీప వీధికి చెందిన ఉలిచి సాంబశివరావు, వనజల కుమారుడు శివ సంపత్‌ ఉక్రెయిన్‌ కార్క్విల్‌లోని యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. తల్లి మాట్లాడుతూ ‘‘మా అబ్బాయి ఆరేళ్లలో ఒక్కసారి వచ్చి వెళ్లాడు. ఆగస్టులో కోర్సు పూర్తిచేసుకొని వస్తాడని చూస్తున్నాం. రష్యా యుద్ధం ప్రకటించినట్లు తెలుసుకొని ఆందోళన చెందాం. అన్నం సహించడంలేదు. సెల్‌ టవర్లు ధ్వంసమయ్యాయని.. ఇకపై వీడియోకాల్‌ కుదరదని శుక్రవారం సందేశం పంపించాడు’’ అంటూ తెలిపారు.

1400 కి.మీ. వెళ్లాలి

వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ఐటీఐ కాలనీకి చెందిన యర్రా సుబ్రహ్మణ్యం, మల్లేశ్వరిల కుమార్తె అఖిల ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె తన తల్లితో శుక్రవారం రాత్రి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తొలిరోజు బంకర్‌లోనే తలదాచుకున్నామని.. శుక్రవారం వసతిగృహానికి పంపించి అవసరమైన వస్తువులు సర్దుకోమని చెప్పారన్నారు. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారని.. 1400 కి.మీ. దూరంలో విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉందన్నారు.

స్నేహితుడి ఇంటిలో తలదాచుకొని..

ఉక్రెయిన్‌ జాఫ్రోరిస్టా విశ్వవిద్యాలయంలో పామూరుకు చెందిన గద్దె వెంకటసాయి ఆర్య ఎంబీబీఎస్‌ అయిదో సంవత్సరం చదువుతున్నాడు. అతను ఉంటున్న ప్లాట్‌ వెనుక ఆర్మీ క్యాంపు బెటాలియన్‌ ఉండడంతో శుక్రవారం ఖాళీ చేసి స్నేహితుడి ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.. యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని తొలుత స్వదేశాలకు పంపుతున్నారన్నారు. తమ కుమారుడితో రాత్రి 7 గంటలకు చరవాణిలో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు తల్లిదండ్రులు రవీంద్రబాబు, స్వప్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి త్వరితగతిన మన దేశానికి రప్పించాలని కోరారు.

నిత్యావసరాలు దొరకడంలేదు

పొనుగుపాటినగర్‌కు చెందిన పుట్టా జశ్వంత్‌ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడినుంచి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ‘యుద్ధంతో కర్ఫ్యూ విధించారు. నిత్యావసరాలు దొరకడంలేదు. బంకర్‌లో మైనస్‌ 4 డిగ్రీల చలి. దుప్పట్లు తెచ్చుకోలేదు. బాంబుల మోతతో భయాందోళనకు గురవుతున్నాం. పోలెండ్‌ మీదుగా భారత్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. సరిహద్దు దాటడంపై ఆందోళనకరంగా ఉంది.’ అని తెలిపారు.

టికెట్‌ కొనుగోలు చేసినా..

అద్దంకిలోని కాకానిపాలెంకు చెందిన బెల్లంకొండ చిరంజీవి 2018లో ఆ దేశానికి వెళ్లారు. పెట్రోమొహిలబ్లాక్‌ సీ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుతూ మైకోలైవి పట్టణంలో ఉంటున్నారు. యుద్ధం వస్తుందని గుర్తించిన చిరంజీవి భారతదేశానికి రావడానికి టికెట్‌ కొనుగోలు చేశాడు. ఈలోపు రవాణా ఆగిపోవడంతో అక్కడే ఉన్నాడు. నిరంతరం రాజమండ్రిలోని బాబాయి బ్రహ్మాజీతో మాట్లాడుతున్నాడు. అద్దంకిలోని కుటుంబసభ్యులు చిరంజీవి కోసం ఎదురుచూస్తున్నారు.

ఆ ప్రాంతంలోనే బాంబు పడింది

ఉక్రెయిన్‌లోని ఒడిసాలో మార్కాపురం మండలం గొట్టిపడియకు చెందిన తుమ్మ సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణమ్మల కుమారుడు వెంకట శివారెడ్డి ఉంటున్నారు. 2016లో వెళ్లిన ఆయన నేషనల్‌ మెడికల్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ‘ఈ నెల 24న నేను ఉంటున్న ప్రాంతానికి దూరంగా బాంబు దాడి జరిగింది .బయట ఎంతమంది చనిపోయారో తెలియదు. ఉదయం తోటి స్నేహితులతో గదిలో ఉంటున్నా.. రాత్రికి బంకర్‌లో తలదాచుకుంటున్నానన్నారు. ఆహారం పూర్తిస్థాయిలో లభించడం లేదు’ అని తెలిపారు.

త్వరగా తీసుకువెళ్లాలి..

రాజుబంగారుపాలేనికి చెందిన కల్లూరి జయప్రతాప్‌ ఉక్రెయిన్‌లోని స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తాము ఉంటున్న ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉన్నా... అంతా భయంగానే గడుపుతున్నట్లు చెప్పారు. ఇక్కడి విద్యార్థులను 775 కి.మీ. దూరాన ఉన్న హంగేరీకి శుక్రవారం రాత్రి బస్సుల్లో తీసుకువెళ్లనున్నట్లు చెప్పారన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కొందరు విద్యార్థులను 11 బస్సుల్లో సరిహద్దు దాటించారన్నారు.

ఇండియాకు రప్పించాలి

సీఎస్‌ పురానికి చెందిన విద్యుత్తు శాఖ బిల్‌ కలెక్టర్‌ ఎర్రగుడ్డి నాగేశ్వరరావు, రాజమణిల కుమార్తె రీనా తేజోన్మయి ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. విన్నిట్సియాలోని కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్న ఆమెతో శుక్రవారం సాయంత్రం ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. హెచ్చరికలు వచ్చినప్పుడు బంకర్లలో తలదాచుకుంటున్నామని, ఆహారం కూడా పూర్తిస్థాయిలో అందడంలేదని రీనా తెలిపిందన్నారు. రెండుసార్లు విమాన టికెట్లు తీసుకున్నా అక్కడి అధికారులు రద్దు చేశారన్నారు. భారతీయ విద్యార్థులను తక్షణం ఇక్కడకు తీసుకురావాలన్నారు.

క్షేమంగానే ఉన్నానంటూ..

యర్రగొండపాలెం మండలం గంగుపల్లెకు చెందిన నంబూరు మహానంద్‌ ఉక్రెయిన్‌ దేశంలోని యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. అయిదేళ్ల క్రితం అక్కడకు వెళ్లాడు. శుక్రవారం ‘న్యూస్‌టుడే’ ఫోన్‌లో సంప్రదించగా ప్రస్తుతం బాగానే ఉన్నానని.. తాను ఉన్న ప్రదేశం నుంచి 220 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరుగుతోందన్నాడు. భారత ప్రభుత్వం రుమేనియా, హంగేరి ప్రాంతాలకు ప్రత్యేక విమానాలు పంపే ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.

బయటకు రావద్దని చెప్పి

‘తొందరపడి బయటకు రావద్దని మా అబ్బాయికి చెప్పాం’ అంటూ అద్దంకి మండలం బొమ్మనంపాడుకు చెందిన నల్లమోతు పవన్‌కుమార్‌ తండ్రి వెంకయ్య తెలిపారు. నాలుగేళ్ల క్రితం కుమారుడు ఉక్రెయిన్‌ వెళ్లాడన్నారు. తాను ప్రస్తుతం ట్రాక్టర్‌ మెకానిక్‌నని, దర్శిలో ఉంటున్నానన్నారు. భయపడటం లేదని.. కుమారుడికి ధైర్యం చెబుతున్నామన్నారు.

పక్క దేశానికి పంపుతామంటున్నారు..

అద్దంకి మండలం పేరాయపాలెం సర్పంచి జాగర్లమూడి సత్యనారాయణ కుమారులు ప్రవీణ్, చందులు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్స్‌కు 500 కి.మీ. దూరంలో ఉంటున్నారు. రోడ్డు మార్గంలో పొరుగు దేశానికి పంపి...అక్కడి నుంచి విమానంలో భారత్‌ పంపిస్తామని అధికారులు తెలిపారన్నారు.

విద్యార్థితో మాట్లాడిన ఎమ్మెల్యే

కొరిశపాడు మండలం మాలెంపాటివారిపాలేనికి చెందిన ఈశ్వర్‌ సాయి పవన్‌... జఫోర్జియాలో చదువుతున్నారు.అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి మాట్లాడారు. ఏ సాయం కావాలన్నా వెంటనే తెలియజేయాలని సూచించారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విజయవాడ విద్యార్థిని కార్తీక..ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంబసీ అధికారులు వేగంగా స్పందించాలంటూ.. కార్తీక బంధువులు కోరుతున్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుని విలవిల

ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థులంతా ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన శీలం రాధిక ఉక్రెయిన్‌లోని కార్కేవ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతోంది. విజయవాడ రాజీవ్‌శర్మనగర్‌కు చెందిన కార్తీక ఉక్రెయిన్‌లోని విన్‌త్సియా జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్‌ రెండో ఏడాది చదువుతోంది. వీళ్లిద్దరూ ఉక్రెయిన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. తమ పరిస్థితిని వివరిస్తూ తల్లిదండ్రులకు వీడియో మోసేజ్‌లు శుక్రవారం పంపించారు. రాధిక ఓ మెట్రోస్టేషన్‌ బేస్‌మెంట్‌లో, కార్తీక ఓ బంకర్‌లో తలదాచుకుంటున్నట్టు వెల్లడించడంతో ఇక్కడ వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఏటా ఎంబీబీఎస్‌ చదివేందుకు రెండు నుంచి మూడు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళుతున్నారు. 15 నుంచి 20 కన్సల్టెన్సీ సంస్థలు విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రత్యేకంగా ఎంబీబీఎస్‌ విద్యార్థులను పంపించేందుకే ఉన్నాయి. ఎంబీబీఎస్‌ ఆరేళ్ల ఎండీ కోర్సును ఉక్రెయిన్‌లోని విద్యా సంస్థలు అందిస్తున్నాయి. ఏటా కోర్సు ఫీజు రూ.2.5 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్యలో ఉంటోంది. ఉక్రెయిన్‌లో లివింగ్‌ కాస్ట్‌ కూడా నెలకు రూ.12 నుంచి రూ.15 వేల లోపే అవుతోంది. ఇంటర్‌లో 50శాతం మార్కులుండి, నీట్‌ పరీక్షలో అర్హత సాధించిన వాళ్లు ఎవరైనా ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ చదివేందుకు అర్హులే కావడంతో ఏటా వందల మంది విజయవాడ, గుంటూరు నగరాల నుంచే వెళుతున్నారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వచ్చాక.. ఇక్కడ స్క్రీనింగ్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణులవుతున్నారు.

రాత్రంతా మెట్రో స్టేషన్‌ మెట్లపై..

ఓ చిన్న గదిలో తలదాచుకున్న శీలం రాధిక, ఆమె స్నేహితులు

ఉక్రెయిన్‌లోని కార్కేవ్‌లో ఉన్న వైద్య విశ్వవిద్యాలయంలో మా అమ్మాయి ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం 30మంది వరకూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాళ్లు కార్కేవ్‌లో మా అమ్మాయితో పాటు ఉన్నారు. వాళ్లంతా కలిసి రాత్రంతా మెట్రో స్టేషన్‌ మెట్లపై కూర్చుని గడిపారు. తెల్లవారాక ఎవరో స్నేహితుల గది దగ్గరలో ఉండడంతో అక్కడికి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మాకు ఫోన్‌ చేసి తన పరిస్థితి వివరిస్తోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. ప్రభుత్వం స్పందించి వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. - కోలకాని శ్రీనివాసరావు, శీలం రాధిక పెదనాన్న

వారంలో వచ్చేస్తుందనుకుంటే..

ఉక్రెయిన్‌లోని విన్‌త్సియా విశ్వవిద్యాలయంలో మా అమ్మాయి ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. 2020 డిసెంబరు నెలలో ఇక్కడి నుంచి ఉక్రెయిన్‌ వెళ్లింది. రష్యా యుద్ధం ప్రకటిస్తుందనే ఆందోళన నెలకొనడంతో మా కుమార్తెను తీసుకొచ్చేందుకు టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేశాం. ఫిబ్రవరి 24న టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. మార్చి 3వ తేదీకి దొరికాయి.వారం రోజుల్లో మా కుమార్తె వచ్చేస్తుందని అనుకుంటుండగా రష్యా యుద్ధం ప్రకటించింది. ఏక్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. - గండికోట శ్రీనివాసరావు, రమాదేవి, కార్తీక తల్లిదండ్రులు

బస్సుల్లో హంగేరీ సరిహద్దుకు ప్రయాణం

విశ్వవిద్యాలయ అధికారుల హెచ్చరికలతో బయటకు రాకుండా కళాశాల ఆవరణలోని వసతి గృహంలోనే విద్యార్థులంతా ఉంటున్నాం. తాము ఉన్న ప్రాంతంలో ఎలాంటి వైమానిక దాడులు లేకపోవడంతో క్షేమంగా ఉన్నా. విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలని అందరిని బస్సుల్లో హంగేరి సరిహద్దులకు తరలించి అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి పంపిస్తామని భారత ఎంబసీ అధికారులు సమాచారం ఇచ్చారు. లగేజీతో ఈ రాత్రికి సరిహద్దుకు బస్సులో చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.

- సాయినోషిత, బాపట్ల

పగలు అపార్ట్‌మెంటు.. రాత్రికి మెట్రోస్టేషన్‌

బొల్లాపల్లి మండలం చక్రాయిపాలెం గ్రామానికి చెందిన లిఖితాబాయి ఉక్రెయిన్‌లోని ఖార్‌కీవ్‌ జాతీయ వైద్య విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ మూడో సంవత్సరం చదువుతుంది. అక్కడికి సుమారు 250 కి.మీ దూరంలోఉన్న కీవ్‌ పట్టణంపై రష్యా దాడులు చేస్తుండటంతో స్థానికులతో కలిసి రాత్రివేళ సమీపంలోని మెట్రో స్టేషన్‌లో గడుపుతున్నామన్నారు. ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉచిత భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిసినా అక్కడకు వెళ్లాలంటే భయపడుతున్నామన్నారు. హంగేరీ, పోలెండ్‌ దేశాల నుంచి విమాన సర్వీస్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అక్కడికి చేరుకోవడానికి ప్రయాణించే వాహనానికి భారతదేశం జెండా పెట్టుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా తన కుమార్తె క్షేమంగా తిరిగిరావాలని తల్లి దుర్గాబాయి దేవుడికి పూజలు చేస్తూ ప్రార్థనలు చేస్తుంది. ఇప్పటి వరకు ధైర్యంగా ఉందని తనతో పాటు ఈపూరు మండల వ్యవసాయాధికారి కుమార్తె రోజా ఉందని వారిద్దరితో పాటు మొత్తం ఐదుగురు తెలుగు విద్యార్థినులు కలిసి ఉన్నారని తండ్రి కొండయ్యనాయక్‌ తెలిపారు.


సైరన్‌ మోగగానే బంకర్లలోకి..

"సైరన్‌ మోగగానే బంకర్లలోకి వెళ్లాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ దేశంలోని జప్రీజీ యూనివర్శిటీలో వైద్య విద్య మూడో సంవత్సరం చదువుతున్నా. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేదు. విద్యార్థులమంతా ఒకచోట గుంపులుగా కూర్చుంటున్నాం. గురువారం రాత్రి సైనికులు వెళ్లే సమయంలో యూనివర్శిటీ భవనం మొత్తం లైట్లు ఆపి కూర్చున్నాం. రాజధానికి 500 కిలోమీటర్ల దూరం అయినప్పటికీ మా ప్రాంతం ఉద్రిక్తంగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యార్థులందరికీ సూచనలు చేస్తున్నారు. సైరన్‌ విన్పించిన వెంటనే సర్దుకొని దగ్గరలోని బంకర్లకు చేరుకోవాలని కోరారు. మొత్తం 18 అంతస్థులు, ఒక్కొక్క అంతస్థుకు 250 గదులు, గదికి నలుగురు విద్యార్థులతో యూనివర్సిటీ ఉంది. నిత్యం యూనివర్సిటీ అధికారులు తమతో మాట్లాడి ధైర్యం చెబుతున్నారు. అయితే వీలైనంత త్వరగా ప్రభుత్వం మమ్మల్ని మన దేశానికి తీసుకు రావాలని వేడుకొంటున్నాం."

- సుప్రజ, గురజాల

ఇబ్బంది పడుతున్నాం.. ఇంటికి చేర్చండి

"మేము ఉండే ప్రాంతంలో బాంబుల శబ్ధాలు భయపెడుతున్నాయి. అధికారుల సూచన మేరకు మెట్రో స్టేషన్లో తలదాచుకున్నాం. ఇక్కడ చలి తీవ్రత మైనస్‌ ఆరు డిగ్రీలుగా ఉంది. ఇక్కడ హీటర్లు లేకపోవడంతో చలికి తట్టుకోవడం కష్టంగా ఉంది. బయట ఆహార పదార్థాలకు కొరత వచ్చింది. దుకాణాల్లో ఆహార పదార్థాల ధరలు పదిరెట్లు పెరిగాయి. మమ్మల్ని ఇండియాకు ఎప్పుడు తీసుకుని వెళతారో సరైన సమాచారం లేదు. ఇండియాకు వెళ్లాల్సిన వాళ్లందరూ ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతమైన హంగేరీ, పోలండ్, రుమేనియా సరిహద్దులకు చేరుకోవాలని చెబుతున్నారు. ఈ ప్రాంతాలు మేము ఉన్న ప్రదేశానికి వెయ్యి కిలోమీటర్ల పైగా దూరం ఉంటుంది. అక్కడికి ఎప్పుడు చేరుకోవాలి.. ఎలా చేరుకోవాలో తెలియడం లేదు. అండర్‌ గ్రౌండ్‌ మెట్రో నుంచి బయటకు వస్తే బాంబుల మోతలు వినిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మాకే ఎక్కువ ప్రాణగండం పొంచి ఉంది. ప్రాధాన్య క్రమంలో మమ్మల్ని ఇక్కడ నుంచి ముందుగా తీసుకుని వెళ్లాలి. భారత ప్రభుత్వం స్పందించి మాగోడు వినిపించుకోవాలి."

- రాజవరపు రోజా, ఉక్రెయిన్‌లో ఉన్న వైద్య విద్యార్థిని

రాత్రంతా జాగారమే

"ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న మా అమ్మాయి గురువారం రాత్రంతా జాగారం చేసింది. వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ కుటుంబసభ్యులందరూ ధైర్యం చెప్పాం. అందరూ క్షేమంగా రావాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాం. భారత ప్రభుత్వం స్పందించి విద్యార్థులను వెంటనే తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి."

- జయశ్రీ, సుప్రజ తల్లి

విజయనగరం జిల్లా బుధరాయవలసకు చెందిన జితేంద్ర కుమార్ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు. తమ కుమారుణ్ని ఇంటికి చేర్చాలంటూ.. అతని తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు.

అధైర్యపడొద్దు

ఉక్రెయిన్‌లో యమున బాగానే ఉంది.. క్షేమంగా తిరిగి వస్తుంది.. ఆందోళన వద్దని విద్యార్థి తల్లిదండ్రులు మైలపల్లి ఎల్లాజి, పైడితల్లిని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు ధైర్యం చెప్పారు. చేపలకంచేరులో వారి ఇంటికి నాయకులతో కలిసి శుక్రవారం వెళ్లి ఓదార్చారు. యమునకు వీడియోకాల్‌ చేసి కాసేపు మాట్లాడారు. విషయాన్ని ఎంపీ రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులకు తెలియజేశామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్‌ ఎల్లాజి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు.

బాగోగులు తెలుసుకుంటూ..

ఉక్రెయిన్‌లో ఉన్న యమున గురించి, అక్కడి పరిస్థితుల గురించి తల్లిదండ్రులు టీవీల్లో చూస్తూ, ఎప్పటికప్పుడు కుమార్తెకు వీడియోకాల్‌ చేసి తెలుసుకుంటున్నారు. తల్లి కన్నీరు పెట్టుకుని మాట్లాడుతుంటే.. అమ్మా నేను క్షేమంగా ఉన్నానని, నువ్వు అలా దిగులుగా ఉండొద్దంటూ కుమార్తె చెప్పడంతో ధైర్యం తెచ్చుకొంది.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మరో కుటుంబానిదీ ఇదే పరిస్థితి. తన కుమారుడు జాహిద్ పర్వేజ్‌ స్వదేశానికి వచ్చేందుకు అధికారులు సాయం చేయాలని..తండ్రి మహబూబబ్ బాషా కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details