స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా.. తెలంగాణప్రభుత్వం పక్షం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. చారిత్రక గోల్కొండ కోట వేదికగా ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. సికింద్రాబాద్ కవాతు మైదానంలోని సైనిక స్మారకం వద్ద యుద్ధవీరులకు అంజలి ఘటించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, పదిన్నరకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. పతాకావిష్కరణకు సీఎం వెళ్లే సందర్భంలో జానపద కళాకారులు.. ఘన స్వాగతం పలుకుతారు. గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. తర్వాత ప్రజాలనుద్దేశించి ప్రసంగిస్తారు.
స్వాతంత్య్ర సంబురాలకు ముస్తాబైన రాష్ట్రం
స్వాతంత్య్ర సంబురాలకు రాష్ట్రం ముస్తాబైంది. వజ్రోత్సవాల ద్విసప్తాహంలో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేయనుండగా మంత్రులు, అధికారులు రాష్ట్రవ్యాప్త వేడుకల్లో పాల్గొంటారు.
వేడుకల సందర్భంగా గోల్కొండ కోటకు ప్రత్యేక అలంకరణ చేశారు. కోట మొత్తం త్రివర్ణమయమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సభాపతులు, మంత్రులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వజ్రోత్సవాల ద్విసప్తాహంలో భాగంగా ఇవాళ తెలంగాణలోనిప్రతి ఇంటా జాతీయ జెండా రెపరెపలాడనుంది. ప్రతి ఇంటిపై జాతీయజెండా-ప్రతి గుండెలో భారతీయత ధ్యేయంగా ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. వజ్రోత్సవాల సందర్భంగా చారిత్రక, ప్రముఖ కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి.ప్రాజెక్టులు, భవనాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇవాళ భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే ‘సారే జహాసే అచ్చా-హిందూ సితాహమారా’సంగీత నృత్య కార్యక్రమాలు ఉంటాయి. అన్నిజిల్లాల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి