Polala Panduga 2022: రైతుల్లానే కల్లాకపటం లేని మనస్తత్వానికి ప్రతీకలు బసవన్నలు. అందుకే తనకు తోడ్పాటునందించే ప్రతి అంశానికి రుణగ్రస్థులై ఉండే రైతులు, ఆది నుంచి అండగా ఉంటున్న ఎద్దుల కోసం ప్రత్యేకంగా ఓ పండుగనే నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏటా శ్రావణ అమావాస్య రోజున పొలాల పేరుతో బసవన్నల కోసం పండగ నిర్వహిస్తారు.
బసవన్నకు రైతుకు మధ్య అనుబంధానికి ప్రతీక పొలాల పండుగ
Polala Panduga 2022 ప్రస్తుతం వ్యవసాయ రంగం నూతన సాంకేతికతతో కొత్తపుంతలు తొక్కుతోంది. ఎన్నో ఆధునాతన మార్పులతో దూసుకుపోతోంది. ఎన్ని మార్పులొచ్చినప్పటికీ దుక్కిదున్నటంలో అన్నదాతకు ఆది నుంచి నేటి వరకూ అండగా నిలుస్తున్నవి బసవన్నలే. వేల సంవత్సరాలుగా రైతుకి ఎద్దుకి ఉన్న అనుబంధం విడదీయనిది. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏటా బసవన్నల కోసం ఏకంగా ఓ పండుగనే చేస్తారు. అదే పొలాల పండగ.
ఉత్సవానికి ఒకరోజు ముందు నుంచే ఎద్దులతో ఎలాంటి పని చేయించకుండా కడుపు నిండా మేత వేస్తారు. మరుసటి రోజు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. బసవన్నలను అందంగా అలంకరించిన అనంతరం కుటుంబ పెద్దతో కలిసి సభ్యులంతా వాటిని గ్రామదేవతల గుడి, హనుమాన్ ఆలయం చుట్టూ తిప్పుతారు. వాటినన్నింటినీ ఒక చోట చేర్చి గ్రామపెద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యుల చేతులు మీదుగా నైవేద్య వితరణ అనంతరం తమలపాకులు తినిపించి.. మంగళహారతులు ఇస్తారు. బసవన్నల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు.
పొలాల పండగ అనగానే ప్రతి పల్లె మురిసిపోతోంది. భాజభజంత్రీలు, డబ్బువాయిద్యాల మధ్య ఊరంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ఎద్దులంటే నందీశ్వరులనీ... శివపార్వతుల తనయులనీ, వాటిని పూజించటం ద్వారా వ్యవసాయం సుభిక్షంగా ఉంటుందని రైతుల నమ్మకం. అందుకే ఊరూ, వాడ ఈ పండగను ఘనంగా నిర్వహించి బసవన్నలపై రైతులకున్న అభిమానాన్ని చాటుతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్యతో శ్రావణ మాసం పరిసమాప్తమవుతోంది. వ్యవసాయ పనుల నిర్వహణలో అప్పటి వరకూ అలసిపోయిన బసవన్నలకు కాస్తంత విశ్రాంతి లభిస్తుంది.