తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా గణేశ్​ నిమజ్జనం.. ఘనంగా వీడ్కోలు పలుకుతున్న భక్తజనం

Ganesh Immersion in Telangana: తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ గణేశ్‌ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న గణపతులు గంగమ్మ ఒడికి తరలివెళ్తున్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, యువతీ యువకుల నృత్యాల నడుమ శోభాయాత్ర కనులపండువగా సాగుతోంది.

Ganesh Immersion
Ganesh Immersion

By

Published : Sep 9, 2022, 8:12 PM IST

Ganesh Immersion in Telangana: రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ శోభాయాత్రతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. ఊరువాడా నిమజ్జనోత్సవ సందడి నెలకొంది. ఆదిలాబాద్‌లో గణేశుడి శోభయాత్ర ప్రారంభమైంది. స్థానిక శిశుమందిరంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశం అనంతరం వినాయక విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, ఎమ్మెల్యే జోగు రామన్న సహా భాజపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పెన్‌గంగ నదిలో శనివారం ఉదయం వరకు విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి చెబుతున్నారు. నిర్మల్‌లో దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గణేశ్​ నిమజ్జనం శోభాయాత్రను ప్రారంభించారు. బుధవార్‌పేట్ ఒకటో నంబర్ గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రలో ఉత్సవ సమితి సభ్యులతో పాటు పట్టణవాసులతో కలిసి నృత్యం చేసి స్థానికులను ఉత్సాహపరిచారు.

నిజామాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఉత్సాహంగా సాగుతోంది. ఐదు అడుగుల లోపు విగ్రహాలు నగరంలోనే నిమజ్జనం చేస్తుండగా.. ఆపై విగ్రహాలను బాసర సమీపంలోని నవీపేట మండలం యంచ వద్ద నిమజ్జానికి తరలిస్తున్నారు. శోభాయాత్ర నగరంలోని దుబ్బ నుంచి వినాయకుల బావి వరకు నిర్వహిస్తున్నారు. వరంగల్‌, ఖాజీపేట, వరంగల్‌ నగరంలో జోరు వర్షంలోనూ నిమజ్జనం కొనసాగుతోంది. గణేశ్​ నిమజ్జనాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధుని నిమజ్జనం చేశారు. గణేశ్​ శోభాయాత్రలతో నగరంలోని వీధులన్నీ కోలాహలంగా మారాయి.

భద్రాచలం పవిత్ర గోదావరిలో నిమజ్జనానికి గణపతులు తరలివెళ్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం జిల్లాల్లోని లంబోదర ప్రతిమలు గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. 2 లాంచీలు, 10 పడవలు, 6 క్రేన్ లు, 2 జేసీబీలు, 2 బ్లేడ్ ట్రాక్టర్లు, 40 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 3వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అంచనావేశారు.

నల్గొండ హనుమాన్‌నగర్‌లోని ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు తెలిపారు. నల్గొండలోని అన్ని గణేష్ ప్రతిమలు క్లాక్ టవర్ సెంటర్‌ చేరుకుని అక్కడి నుంచి రామాలయం, ప్లై ఓవర్, పానగల్ బైపాస్ నుంచి వల్లభరావు చెరువు, దండెంపల్లి వద్దగల ఎస్​ఎల్​బీసీ కాల్వ ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నారు. సూర్యాపేటలో మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details