తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్‌ కార్డ్ ఫ్రీ అనుకుంటున్నారా? అయితే పొరబడ్డట్టే! - banks issue credit cards to exisisting holders

మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే అప్పుడప్పుడు క్రెడిట్‌ కార్డును వాడుతుంటాం. బ్యాంకులు ఈ వెసులుబాటును కొత్తగా ఉద్యోగంలో చేరినవారితో పాటు, ఇప్పటి వరకు కార్డు తీసుకోని తమ పాత ఖాతాదారులకూ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు..

Tips For New Credit card Holders
Tips For New Credit card Holders

By

Published : Sep 9, 2022, 10:25 AM IST

Tips For New Credit card Holders : చేతిలో డబ్బు లేకపోయినా.. ఏదైనా కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డుతో వెసులుబాటు ఉంటుంది. ఇటీవల కాలంలో బ్యాంకులు మళ్లీ క్రెడిట్‌ కార్డుల జారీకి పోటీ పడుతున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితోపాటు, ఇప్పటి వరకూ కార్డు తీసుకోని తమ పాత ఖాతాదారులకూ కార్డులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కార్డు తీసుకుంటున్న వారు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే...

  • సాధారణంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సమయంలో బ్యాంకులు కొన్ని రుసుములు వసూలు చేస్తాయి. వార్షిక రుసుము, స్టేట్‌మెంట్‌ ఫీజులాంటివి ఇందులో ఉంటాయి. కార్డుపోతే కొత్త కార్డు ఇచ్చేందుకూ రుసుములు తీసుకుంటాయి. ఇవన్నీ కనిపించకుండానే తడిసి మోపెడు అవుతాయి. కొత్తగా కార్డు తీసుకునే వారు.. సున్నా లేదా తక్కువ రుసుములు ఉన్న కార్డులను తీసుకోవాలి.
  • క్రెడిట్‌ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించినప్పుడు ఎలాంటి వడ్డీ ఉండదు. సాధారణంగా ఉచిత వడ్డీ కాలం 50 రోజుల వరకూ ఉంటుంది. ఇది పూర్తిగా మీ కార్డు బిల్లింగ్‌ సైకిల్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ఆలస్యం చేసినప్పుడు రుసుముతోపాటు, వడ్డీ విధిస్తుంది.
  • ప్రతి క్రెడిట్‌ కార్డుకూ గరిష్ఠ వినియోగ పరిమితి ఉంటుంది. ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో ఆ మేరకే దాన్ని వినియోగించేందుకు వీలవుతుంది. కార్డుదారుడి క్రెడిట్‌ స్కోరు, చెల్లింపుల చరిత్ర, ఆదాయం, వినియోగ నిష్పత్తిలాంటివి పరిగణనలోకి తీసుకొని, పరిమితిని నిర్ణయిస్తారు. తొలిసారి కార్డు తీసుకున్న వారికి ఇది కాస్త తక్కువగా ఉండొచ్చు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తూ ఉంటే..కొంత కాలం తర్వాత పరిమితిని పెంచే అవకాశం ఉంటుంది.
  • చాలామంది మొత్తం బిల్లు చెల్లించకుండా.. కనీస బిల్లు మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఇది సాధారణంగా మొత్తం బిల్లులో 5 శాతం వరకూ ఉంటుంది. ఈ కనీస మొత్తాన్ని చెల్లించడం వల్ల క్రెడిట్‌ కార్డు అమల్లో ఉంటుంది. కానీ, మిగతా మొత్తానికి వడ్డీ తప్పదు. కాబట్టి, గడువులోపు మొత్తం బిల్లును చెల్లించడమే ఎప్పుడూ మేలు. ఒకవేళ పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఈఎంఐగా మార్చుకోవడం మంచిది.
  • క్రెడిట్‌ కార్డు బిల్లు వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా గమనించాలి. ఏం కొన్నారు? కొన్న బిల్లులూ.. స్టేట్‌మెంట్‌లో వచ్చిన మొత్తం సరిగానే ఉందా? వడ్డీ, రుసుముల్లాంటివి ఏమైనా ఉన్నాయా? సరి చూసుకోవాలి. లావాదేవీల్లో ఏదైనా వ్యత్యాసం ఉంటే కార్డు సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి.
  • కార్డు బిల్లింగ్‌ తేదీలను జాగ్రత్తగా గమనించాలి. మీ కార్డు బిల్లు ఒక నెలలో రెండో తేదీన బిల్లింగ్‌ ముగిస్తే.. మూడో తేదీ నుంచి కొత్త బిల్లింగ్‌ ప్రారంభమవుతుందన్నట్లు. బిల్లింగ్‌ ప్రారంభంలో కొన్నప్పుడు మాత్రమే 50 రోజుల వ్యవధి లభిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వ్యవధి తగ్గుతుంది.
  • రివార్డులు, నగదు వెనక్కి తదితరాలను పరిశీలించాలి. రివార్డు పాయింట్ల ద్వారా కొన్ని వస్తువుల కొనుగోలుపై రాయితీ లభిస్తుంది. ప్రయాణాల్లో, హోటల్‌ బుకింగ్‌లోనూ డిస్కౌంట్లు లభిస్తాయి. 'నగదు వెనక్కి' ఆఫర్లు ఉన్నప్పుడు.. వెంటనే ఆ ప్రయోజనం లభిస్తుంది. కార్డుతో కొనుగోళ్లు చేసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
  • క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి, ఏటీఎంలో నగదు తీసుకోవచ్చు. కానీ, దీనికి నెలకు 3.5 శాతం వరకు వడ్డీ ఉంటుందని మర్చిపోవద్దు.

ABOUT THE AUTHOR

...view details