దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 11 శాతం పెరిగినట్లు వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి రూ. 9769 కోట్లు లాభం రాగా.. క్యూ3లో రూ.10,846 కోట్లుగా నికర లాభం నమోదైనట్లు అధికారికంగా ప్రకటించింది.
Q3లో TCS లాభం 11% వృద్ధి.. ఒక్కో షేరుపై రూ.75 డివిడెండ్ - 11 శాతం వృద్ధి చెందిన టీసీఎస్ లాభం
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 11 శాతం మేర వృద్ధి చెందినట్లు తెలిపింది. క్యూ3లో ఆ మొత్తం రూ.10,846 కోట్లుగా నమోదైనట్లు అధికారికంగా వెల్లడించింది.
గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.48,885 కోట్లుగా ఉంది. క్యూ3లో ఆ మొత్తం 19.1 శాతం వృద్ధి చెంది.. రూ. 58,229 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. కంపెనీలో వలసలు సైతం 21.5 శాతం నుంచి 21.3 శాతానికి తగ్గినట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ గోపీనాథ్ తెలిపారు. కంపెనీ మొత్తం శ్రామిక శక్తి 2,197 క్షీణించి 6,13,974కి చేరుకున్నట్లు తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో 7.5 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఒక్కో షేరుపై రూ.75 డివిడెండ్
ఈ సందర్భంగా వాటాదారులకు టీసీఎస్ డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేరుపై స్పెషల్ డివిడెండ్ రూ.67తో కలుపుకొని మొత్తం రూ.75 డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు రికార్డు డేట్‌ను జనవరి 17గా కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 3న డివిడెండ్ చెల్లింపులు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ షేరు సోమవారం బీఎస్‌ఈలో 3.35 శాతం లాభపడి రూ.3,319.79 చేరుకుంది.