Satya Nadella: క్రికెట్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలకనుంది అమెరికా. వచ్చే ఏడాది నుంచి మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్సీ) పేరుతో కొత్త టోర్నీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ టీ20 లీగ్ కోసం ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే 44 మిలియన్ డాలర్లు సేకరించింది. ఇందులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక ఇన్వెస్టర్‌గా ఉన్నారు. ఆయన ఇప్పటికే మేజర్ లీగ్ సాకర్‌లో సియాటెల్ సౌండర్స్ సహ యజమాని. ఇప్పుడు క్రికెట్లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.
Major league cricket news: ఎంఎల్సీ కోసం మొత్తం 120 మిలియన్ డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 44 మిలియన్ డాలర్లు సమకూరగా.. రానున్న 12 నెలల్లో మరో 76 మిలియన్లు సమాకూర్చనున్నారు. ఎంఎల్సీ టీ20 లీగ్ కోసం 6 ప్రాంఛైజీలకు అమెరికా క్రికెట్ అనుమతిచ్చింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రీడగా ఉన్న క్రికెట్‌కు అమెరికాలో కూడా ఆదరణ పెంచాలని ఆ దేశం భావిస్తోంది. అందుకే అక్కడి బడా వ్యాపారవేత్తలు ఈ టోర్నీ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ 120 మిలియన్ డాలర్లతో అమెరికాలో మంచి క్రికెట్ పిచ్‌లున్న స్టేడియాలు ఏర్పాటు చేయడం సహా, ఆటగాళ్లు, అభిమానుల కోసం అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. అమెరికాలో కొత్త తరం క్రికెటర్లను తయారు చేయనున్నారు. అంతేకాదు వచ్చే పదేళ్లలో అక్కడ అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఏటా నిర్వహించే ఎంఎల్‌సీలో వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఆటగాళ్లను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈ టోర్నీని విజయవంతం చేసి అమెరికాను కూడా క్రికెట్‌కు నిలయంగా మార్చాలనుకుంటున్నారు.