తెలంగాణ

telangana

ETV Bharat / business

'మేమూ పరీక్షలు చేస్తాం'.. వైద్య సేవల రంగంపై అదానీ, రిలయన్స్ ఆసక్తి

వైద్య సేవల రంగంలో ఆరోగ్య పరీక్షల విభాగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అపోలో, అదానీ, రిలయన్స్‌, టాటా 1ఎంజీ వంటి సంస్థలు.. ఇందులో అడుగుపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా తమ నెట్​వర్క్​ను విస్తరించేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Reliance Adani diagnostics
Reliance Adani diagnostics

By

Published : Oct 26, 2022, 7:11 AM IST

వైద్య సేవల రంగంలో ఆరోగ్య పరీక్షల (డయాగ్నస్టిక్‌ సేవలు) విభాగానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఇది పూర్తిగా నగదు వ్యాపారం. పైగా వేగంగా విస్తరిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతూ ఉండడానికి తోడు, ఆరోగ్య బీమా విస్తరించడంతో వైద్య పరీక్షలకు ఎవరూ వెనుకంజ వేయడం లేదు. అందుకే ఆరోగ్య పరీక్షల దేశీయ మార్కెట్‌ ఆకర్షణీయమైన వృద్ధి సాధిస్తోంది. మన దేశంలో ఆరోగ్య పరీక్షల మార్కెట్‌ రూ.67,500 కోట్లకు పైగానే ఉంది. ఏటా 9-10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో జాతీయ స్థాయి సంస్థల వాటా 15 శాతమే. చిన్న, మధ్యస్థాయి సంస్థలు లేదా ఒకటి రెండు ప్రాంతాలకే పరిమితమై సేవలు అందిస్తున్న సంస్థల వాటా 85 శాతం వరకూ ఉంది. ఈ సమీకరణాలే కార్పొరేట్‌ దిగ్గజాలు, ఫార్మా కంపెనీలు, కార్పొరేట్‌ ఆస్పత్రులు.. ఆరోగ్య పరీక్షల మార్కెట్‌ వైపు చూసే పరిస్థితి కల్పిస్తున్నాయి.

ఈ విభాగంలో థైరోకేర్‌ (ప్రస్తుతం ఫార్మ్‌ఈజీకి చెందిన సంస్థ), డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, ఎస్‌ఆర్‌ఎల్‌ ర్యాన్‌బాక్సీ.... తదితర సంస్థలు గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్‌ సేవలు అందిస్తున్నాయి. ఇపుడు ఇదేవిధంగా జాతీయ స్థాయిలో అన్ని ప్రాంతాల్లో డయాగ్నస్టిక్‌ సేవలు అందించడానికి దిగ్గజ కార్పొరేట్లు ముందుకు వస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్‌, అదానీ గ్రూపు, రిలయన్స్‌, టాటా 1ఎంజీ... తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆరోగ్య పరీక్షల విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ఈ ఏడాది మే నెలలో అదానీ గ్రూపు వెల్లడించింది. దీని కోసం ప్రత్యేకంగా అదానీ హెల్త్‌ వెంచర్స్‌ అనే పేరుతో ఒక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. నెట్‌మెడ్స్‌ అనే సంస్థను రిలయన్స్‌ గ్రూపు, 1ఎంజీ అనే సంస్థను టాటా గ్రూపు కొనుగోలు చేసి, ఫార్మసీ రిటైలింగ్‌ రంగంలోకి ప్రవేశించిన విషయం విదితమే. ఈ సంస్థలు ఇపుడు డయాగ్నస్టిక్‌ సేవల్లోకి విస్తరిస్తున్నాయి.

హైదరాబాద్‌ కంపెనీ సైతం..
ఫార్మా రంగంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటైన లుపిన్‌ లిమిటెడ్‌ ఆరోగ్య పరీక్షల వ్యాపారంలోకి ఈ ఏడాది జులైలో అడుగుపెట్టింది. దీనికోసం లుపిన్‌ డయాగ్నస్టిక్స్‌ అనే అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందే టోరెంట్‌ ఫార్మాసూటికల్స్‌, టోరెంట్‌ డయాగ్నస్టిక్స్‌ అనే విభాగాన్ని నెలకొల్పింది. హైదరాబాద్‌కు చెందిన రిటైల్‌ ఫార్మసీ సేవల సంస్థ అయిన మెడ్‌ప్లస్‌ ఈ ఏడాది మార్చిలో డయాగ్నస్టిక్స్‌ సేవలను ప్రారంభించింది. ఇవే కాకుండా కార్పొరేట్‌ ఆసుపత్రులైన మ్యాక్స్‌ హాస్పిటల్స్‌, ఏస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ సైతం ఈ విభాగంలో విస్తరిస్తున్నాయి.

వినియోగదార్లకు మేలు
తాజా పరిణామాల వల్ల సమీప భవిష్యత్తులో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగంలోని ప్రాంతీయ లేదా చిన్న, మధ్యస్థాయి సంస్థలను కొనుగోలు చేసేందుకు ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్న బడా కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వస్తాయని భావిస్తున్నారు. తద్వారా ‘ఇన్‌-ఆర్గానిక్‌’ పద్ధతిలో వేగంగా విస్తరించేందుకు ఆ సంస్థలు ప్రయత్నిస్తాయని అంటున్నారు.

మరోపక్క మార్కెట్లో అధిక వాటాను సొంతం చేసుకునేందుకు ఆరోగ్య పరీక్షల ధరలు తగ్గించటంతో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజీలు అమలు చేసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది వినియోగదార్లకూ మంచి చేసే అంశం. మొత్తం మీద ఆరోగ్య పరీక్షల వ్యాపార విభాగంలో సమీప భవిష్యత్తులో పలు రకాలైన మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details