RBI MPC Meeting Updates : ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రెపోరేటును 6.5 శాతం వద్దనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్లను సైతం 6.75 శాతం వద్ద స్థిరంగానే ఉంచింది. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, అంతర్జాతీయంగానూ ప్రతికూలతలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ..
భారతదేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా అనేక ప్రతికూల అంశాల ప్రభావం మనపై పడుతోంది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. దీనితో విదేశీ పెట్టుబడులు భారీగా తరలివెళ్తున్నాయి. మరో వైపు దేశీయ ద్రవ్యోల్బణం కూడా క్రమంగా పెరుగుతోంది. పైగా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం జరిగింది.
వృద్ధి అంచనాలు
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి అంచనాలు 6.5 శాతంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
- ఆగస్టులో వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) 6.83 శాతానికి చేరింది. సెప్టెంబర్ సీపీఐ అంచనాలు మరో వారం రోజుల్లో రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం అటుఇటుగా 2 శాతం మార్జిన్‌తో సీపీఐను 4 శాతం వద్ద ఉంచాలని ఆర్బీఐను ఆదేశించడం జరిగింది.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది.
- ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉంది. అయితే వచ్చే ఏడాదికి ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది.
- కూరగాయల ధరలు, వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిన నేపథ్యంలో.. టర్మ్ ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.
- ఈ మూడో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. అయితే ఆకస్మిక ఆహారం, ఇంధన ధరల పెరుగుదల సమస్య ఏర్పడినా.. దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
- దేశీయంగా ఆస్తుల నాణ్యత పెరుగుతున్న నేపథ్యంలో.. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా కొనసాగుతోందని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఆర్బీఐ కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.