తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2023, 6:32 AM IST

ETV Bharat / business

2022లో లక్షన్నర ఐటీ ఉద్యోగాలు పోయాయ్‌!

కొవిడ్‌ సమయంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా అధిక వేతనాలపై నిపుణులను భారీగా నియమించుకున్న టెక్నాలజీ సంస్థలు.. ఇప్పుడు గిరాకీ తగ్గడంతో, సాధ్యమైనంత మందిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. పని కంటే ఎక్కువ వేతనం పొందుతున్నారని భావిస్తున్న వారితో పాటు, పనితీరు సంతృప్తికరంగా లేనివారు వేటుకు గురవుతున్నారు.

One and a half million IT jobs will be lost in 2022!
One and a half million IT jobs will be lost in 2022!

కొవిడ్‌ పరిణామాల్లో దాదాపు అన్ని రంగాల సంస్థలు, తమ కార్యకలాపాలను డిజిటలీకరణ చేసుకున్నాయి. ఇకామర్స్‌ కొనుగోళ్లు అధికంగా జరిగాయి. లాక్‌డౌన్‌ల కారణంగా, ఇళ్ల వద్ద ఖాళీగా ఉన్న వారు సామాజిక మాధ్యమాలను, యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా తిలకించారు. ఆన్‌లైన్‌లోనే పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్‌ సంస్థలకూ అమిత డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఇందువల్లే అంతర్జాతీయ సంస్థలైన మెటా, గూగుల్‌, అమెజాన్‌, యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి సంస్థలు తమకు వచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. బైజూస్‌ వంటి అంకుర సంస్థలూ ఈ విషయంలో తగ్గలేద. రెండేళ్లు ఇదే పరిస్థితి. తదుపరి చూస్తే..

  • 2022 నుంచి ఐటీ కంపెనీలకు డిజిటలీకరణ ప్రాజెక్టులు తగ్గుతున్నాయి. అమెరికా, ఐరోపాలను ఆర్థిక మందగమనం కలవర పెడుతోంది. అందుకే వ్యయ నియంత్రణ కోసం టెక్‌ సంస్థలు తమ 'అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను' వదిలించుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.
  • 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1013 సంస్థలు 1,53,160 మంది ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ లైవ్‌ ట్రాకింగ్‌ వెల్లడించింది. కొవిడ్‌ నుంచి చూస్తే, ఇప్పటివరకు 1539 సంస్థలు దాదాపు 2,49,151 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. అధిక తొలగింపులు కన్జూమర్‌, రిటైల్‌ రంగంలోనే ఉన్నాయి.

లాభాలు తగ్గడంతోనే..
టెక్‌ రంగం 2022లో ఒక్కసారిగా డీలాపడింది. అమెరికాలోని 5 అతి పెద్ద టెక్‌ కంపెనీల ఆదాయం తగ్గిపోయింది. ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తుండటంతో, సాధ్యమైనంత తొందరగా ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2022లో మెటా 11,000, అమెజాన్‌ 10,000, సిస్కో 4,100 ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెల్లడించింది. ట్విటర్‌ సిబ్బందిలో దాదాపు 75% మందిని నూతన యజమాని ఎలాన్‌ మస్క్‌ ఇంటికి పంపించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

అంకురాల నుంచే 18,000 మంది
గత ఏడాది కాలంలో మన దేశంలోని పలు అంకురాలు దాదాపు 18వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ఇంక్‌.42.కామ్‌ నివేదిక వెల్లడించింది. బైజూస్‌ 2,500, ఓలా 2,300, బ్లింకిట్‌ 1,600, అనకాడమీ 1,150, వేదాంతు 1,109, వైట్‌హ్యాట్‌ జూనియర్‌ 1,000 ఉద్యోగాల్లో కోత విధించినట్లు పేర్కొంది.

ప్రాంగణ ఎంపికలు నెమ్మదిగా
దేశీయ సంస్థలతోపాటు, అంతర్జాతీయ సంస్థలూ నూతన నియామకాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభ స్థాయి, ప్రాంగణ ఎంపికలు నెమ్మదిగా సాగుతున్నాయి. కొత్తతరం సాంకేతికతలైన కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, వెబ్‌3, డేటాసైన్స్‌, అనలిటిక్స్‌లాంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. సంస్థలు తమకు అవసరమైన పనిని చేయగల ఉద్యోగుల కోసం చూస్తున్నాయి. దీంతో ఇంటర్న్‌షిప్‌ల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details