Married Couple Money Management : సాధారణంగా మహిళలు, పురుషులు వైవాహిక జీవితానికి ముందు ఆర్థిక వ్యవహారాలను చూసుకోవడం వారి వ్యక్తిగతం. ఇలాంటి సందర్భంలో ఇద్దరికీ స్వాతంత్ర్యం ఎక్కువే ఉంటుంది. కానీ, వివాహం తర్వాత ఇద్దరూ ఆర్థిక వ్యవహారాలను కలిపి నిర్వహించడం మంచిదని.. దీనివల్ల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, ఉత్తమ భార్యాభర్తలకు కూడా మనీ మేనేజ్మెంట్ ఒక సవాల్. అలాంటి జంటలకు వారి వ్యక్తిగత, భాగస్వామ్య లక్ష్యాలను తప్పనిసరిగా అంచనా వేసుకుని మసులుకోవాలి. వివాహిత జంటలు ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకుందాం.
ఉమ్మడి నిర్ణయాలు ఉత్తమం..
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్దానం మాత్రమే కాదు.. బాధ్యతలు, అలవాట్లు, ప్రాధాన్యతలతో పాటు ముఖ్యంగా పెద్ద ఆర్థిక మార్పు కూడా. పెళ్లైన తర్వాత ఇద్దరి ఆర్థిక అలవాట్లలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే పెళ్లి తర్వాతే ఇంటి కొనుగోలు, భవిష్యత్ ప్రణాళికలు, పెట్టుబడులు, పిల్లలు చదువులు వంటివి మదిలో మెదులుతుంటాయి. ఇలాంటివన్నీ భాగస్వాముల జీవనశైలిలో చాలా మార్పులు తీసుకొస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్‌ను ప్రారంభించడానికి వ్యవస్థీకృత ఆర్థిక ప్రణాళిక అవసరం. అందుకోసం కొత్తగా విహాహం అయినవారు ఆర్థిక నిర్వహణ గురించి విడిగా కాకుండా.. భార్యాభర్తలిద్దరూ కలిపే నిర్ణయాలు తీసుకోవాలి.
ఖర్చులు ప్లాన్ చేయాలి..
భాగస్వాములిద్దరిలో.. ఎవరికైనా ఎక్కువ ఖర్చు చేసే అలవాటు ఉంటే ఆ విషయంపై చర్చించండి. భార్యాభర్తలిద్దరూ నిర్ణీత నెలవారీ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. రెంట్/మెయింటెనెన్స్, కిరాణా సామగ్రి, యుటిలిటీలు, ముఖ్యంగా పిల్లల చదువు మొదలైన వాటికి చెల్లించడానికి జాయింట్ ఖాతాను నిర్వహించొచ్చు. మీ కుటుంబానికి తగిన జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండేలా జగ్రత్త పడాలి.
భార్యభర్తలు ఉద్యోగులైతే.. తమ ఆదాయం ప్రకారం ఇంటి ఖర్చులను, భవిష్యత్ పొదుపులను డివైడ్ చేసుకోవచ్చు. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులతో సహా లెక్కవేసి.. ఇద్దరి ఆదాయంలో చెరో 50 శాతం ఖర్చు చేయొచ్చు. ఒకవేళ దంపతులిద్దరిలో ఎవరైనా ఎక్కువ సంపాదిస్తే.. వారు ఖర్చులలో తమ వాటాను పెంచుకోవచ్చు. ఈ ఖర్చులను ట్రాక్ చేయడానికి స్పార్ట్ ఫోన్ సాయం తీసుకోవచ్చు. దీనికోసం ఇప్పటికే వివిధ మొబైల్ యాప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి తగిన విధంగా ప్లాన్ చేసుకోవచ్చు.
జాయింట్ ఖాతా అవసరం..
భార్యాభర్తలకు విడివిడి బ్యాంకు ఖాతాలు ఉన్నా... ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు డిపాజిట్/విత్‌డ్రా చేసుకోవడానికి ఒక జాయింట్ బ్యాంకు అకౌంట్‌ను తీసుకోవడం మంచిది. బ్యాంకు డిపాజిట్లలో కొన్ని ట్యాక్స్ సబ్సిడీలు లభిస్తాయి. ఇద్దరిలో ఎవరు తక్కువ పన్ను శ్లాబ్‌లో ఉంటే.. వారి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు. ఇలా ప్రణాళిక చేసుకుంటే పన్ను ఆదా అవుతుంది.