రెండేళ్ల క్రితం వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. దీంతో తక్కువ వడ్డీకి డిపాజిట్ చేసిన వారు తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునేందుకు ఆలోచిస్తున్నారు. పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులు గత కొన్నాళ్లుగా వడ్డీ రేట్లను పెంచుతూనే ఉన్నాయి. రుణాలకు గిరాకీ అధికంగా ఉండటంతో.. డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలను తీసుకొస్తున్నాయి. దీంతో నమ్మకమైన పెట్టుబడిగా పేరున్న ఎఫ్‌డీలవైపు మళ్లీ సంప్రదాయ పెట్టుబడిదారులు కొంత మేరకు మొగ్గు చూపుతున్నారు.
ఆచితూచి..
వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో వీటిలో మదుపు చేయాలనుకుంటున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకే మొత్తంలో ఎఫ్‌డీ చేసే బదులు చిన్న చిన్న మొత్తాలుగా విభజించి, వివిధ కాల వ్యవధులకు డిపాజిట్ చేయాలి. కనీసం మూడు వేర్వేరు ఎఫ్‌డీలను చేయడం మంచిది. ఉదాహరణకు ఆరు నెలల వ్యవధికి ఒకటి, ఏడాది కాలానికి మరోటి, 18-24 నెలల వ్యవధికి మూడో ఎఫ్‌డీ చేయొచ్చు.
స్వల్పకాలిక ఎఫ్‌డీలను ఆటో రెన్యువల్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా బ్యాంకు వడ్డీ రేటును పెంచినట్లయితే, మీరు వ్యవధి తీరిన తర్వాత ఎఫ్‌డీని రద్దు చేసుకొని, కొత్త వడ్డీ రేటులో డిపాజిట్ చేయొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా మరికొంత కాలం వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చు. ఇది ఎంత వరకూ ఉంటుందనేది స్పష్టంగా చెప్పలేం. కాబట్టి, మీరు ఎఫ్‌డీలను దీర్ఘకాలానికి కాకుండా స్వల్పకాలానికి మదుపు చేస్తూ ఉండాలి.