తెలంగాణ

telangana

ETV Bharat / business

అనవసర ఖర్చులా?.. ఇబ్బందుల్లో పడక తప్పదు.. పొదుపు 'ఫార్ములా' పాటించండిలా.. - డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి

Reduce Unnecessary Expenses : మీరు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? భావి జీవితం కోసం పొదుపు, మదుపు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్​.. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి మంచి మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి.

How to reduce unnecessary expenses?
Expenses That Are Destroying Your Budget

By

Published : Jun 13, 2023, 12:03 PM IST

Reduce Unnecessary Expenses : మీరు అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారా? గొప్పల కోసం శక్తికి మించి అప్పులు చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఏదో ఒక రోజు మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. ఇలాంటి చెడు అలవాట్ల నుంచి వీలైనంత త్వరగా బయటపడండి. అప్పుడే మీ భావిజీవితం ఆనందకరంగా ఉంటుంది.
మన సమాజంలో ఆర్థిక అక్షరాస్యత చాలా తక్కువ. దీనికి తోడు సామాజికంగా మెరుగైన స్థితిలో ఉన్నామని గొప్పలకు పోవడం ఎక్కువ. అందుకోసం మితిమీరి ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ ఇది మన ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తుంది. అందుకే ఇలాంటి అనవసర ఖర్చుల నుంచి బయటబడే మార్గాల గురించి తెలుసుకుందాం.

పొదుపు వర్సెస్​ మదుపు
మనలో చాలా మందికి పొదుపు - మదుపులకు మధ్య ఉన్న భేదం ఏంటో తెలియదు. సాధారణంగా ఖర్చులు చేయగా మిగిలిన దానినే పొదుపు అనుకుంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఉదాహరణకు మీకు నెలకు ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి. దాని నుంచి మీరు ముందుగానే రూ.20 వేలు భవిష్యత్​ అవసరాల కోసం పక్కన పెట్టాలి. దానినే పొదుపు అంటారు. మిగిలిన సొమ్ము మీ అవసరాల కోసం, సరదాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల భవిష్యత్​లో అత్యవసరంగా ఆర్థిక అవసరాలు ఏర్పడినా.. ఎలాంటి ఇబ్బంది రాదు.
మీ ఆదాయం నుంచి కొత్త మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు.. దాని వల్ల వడ్డీల రూపంలో, లాభాల రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఫలితంగా మీ నికర ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. దీనిలో కొంత మేరకు నష్టభయం కూడా ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ పాజిటివ్​ దృక్పథంతోనే ముందుకు అడుగేయాల్సి ఉంటుంది.

వ్యూహాత్మకంగా ఖర్చు పెట్టాలి!
మనం డబ్బు సంపాదించడానికి జీవించడం లేదు. సంతోషంగా జీవించడానికి డబ్బు సంపాందిస్తున్నాం అనే స్పృహ అందరికీ ఉండాలి. దీని కోసం 50:30:20 నియమాన్ని పాటించాలి. ముందుగా మన కష్టార్జితంలోంచి కొంత సొమ్మును పొదుపు చేయాలి. ఇది మీ సంపాదనలో 20 శాతం వరకు ఉండాలి. తరువాత తప్పని నిత్యావసర ఖర్చులు అంటే.. ఇంటి అద్దె, కిరాణా సామగ్రి, దుస్తులు, ప్రయాణ ఖర్చులు మొదలైన వాటికి ఖర్చు చేయాలి. దీని కోసం మీ సంపాదనలో 50 శాతం వరకు ఖర్చు పెట్టవచ్చు. తరువాత మన సరదాల కోసం, కోరికలను తీర్చుకోవడం కోసం తప్పకుండా ఖర్చు పెట్టుకోవాలి. దీని కోసం మీ సంపాదనలో 30 శాతం వరకు ఖర్చు పెట్టవచ్చు. ఇది కాస్త ఎక్కువ అనుకుంటే, దీనిని కూడా పొదుపుగా మార్చుకోండి.

ఏదైనా కొనే ముందు.. కాస్త ఆలోచించండి!
జేబులో కాస్త డబ్బులు ఉంటే చాలు.. కనిపించిందల్లా కొనేయాలని అనిపిస్తుంది. చాలామటుకు మన ఆదాయం ఇలానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. పొరపాటున మన చేతిలో క్రెడిట్​కార్డ్​ ఉంటే.. మరి చెప్పాల్సిన పనిలేదు. ఖర్చుకు అంతూపొంతూ ఉండదు. కానీ ఇది సరైన విధానం కాదు. ఏదైనా మనకు అవసరమైన వస్తువులకు మాత్రమే ఖర్చు చేయాలి. లగ్జరీ వస్తువులు కొనాలనుకున్నప్పుడు కచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి.. అవసరం అనుకుంటే మాత్రమే కొనుగోలు చేయండి.

నిపుణుల సలహాలు తీసుకోండి!
వాస్తవానికి చదువులేనివారు మాత్రమే కాదు.. చదువుకున్న వారిలో కూడా చాలా మందికి ఆర్థిక అక్షరాస్యత ఉండదు. తమ సంపాదనను ఏ విధంగా వినియోగించుకోవాలో వారికి తెలియదు. పొదుపు, మదుపులకు భేదం తెలియదు. ఇలాంటి వారు కచ్చితంగా ఆర్థిక నిపుణుల వద్ద సలహాలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అనిశ్చితి ఎక్కువగా ఉండే స్టాక్​మార్కెట్​ లాంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా అవసరం.

ఇతరులను అనుకరించకండి!
మానవులకు ఉన్న అత్యంత దారుణమైన అలవాటు.. ధనవంతులను, పక్కనున్నవారిని అనుకరించడం. పక్కనున్నవారు చీరలు కొన్నారంటే.. మనం కూడా భార్య కోసం చీర కొనేస్తాం. వీధిలో ఉన్న ఒకాయన కారు కొంటే.. అవసరం లేకపోయినా, నిజానికి సరిపడా డబ్బులు లేకపోయినా.. గొప్పలు కోసం మనం కూడా అప్పు చేసి మరీ కారు కొంటాం. ఇది సరికాదు. ఇవి భవిష్యత్తులో మిమ్మల్ని అప్పుల ఊబిలోకి లాగేస్తుంది.

అప్పు చేసి పప్పు కూడు తినకండి!
నేడు అప్పులు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. క్రెడిట్​ కార్డులు వచ్చిన తరువాత ఇవి మరీ పెరిగిపోయాయి. అనవసరమైన ఖర్చులు చేయడం.. క్రెడిట్​ కార్డు బిల్లులు కట్టడానికి బయట అప్పు చేయడం సర్వసాధారణం అయిపోయింది. విలాసవంతమైన జీవనశైలి కూడా అప్పులు పెరిగిపోవడానికి కారణం అవుతోంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. అప్పులు పెరిగిపోయి.. చివరికి మీ ఆర్థిక జీవితం చిన్నాభిన్నమవుతుంది.

అకస్మాత్తుగా వచ్చే ఖర్చులకు సిద్ధంగా ఉండాలి!
మన నియంత్రణలో లేని చాలా ఖర్చులు ఉంటాయి. అనారోగ్యం వస్తుంది. ప్రమాదాలు జరిగి గాయపడడం, మరణించడం లాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులకు మీరు సన్నద్ధంగా ఉండాలి. అంటే మీరు కచ్చితంగా మీ ఆదాయాన్ని సరైన మార్గంలో పొదుపు చేసుకోవాలి. అలాగే సరైన పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను కూడా వెతుక్కోవాలి. అదే విధంగా ఆరోగ్య బీమా, జీవిత బీమాలను తప్పకుండా తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details