How to Get Crop Insurance : అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, కరవులతో అల్లాడుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పథకాన్ని తీసుకొచ్చింది. 2016 జనవరి 13న కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదించింది. ఈ పథకం కింద ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు.. రైతులు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో కేవలం 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. అదే విధంగా రబీ ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు బీమా కంపెనీలు నిర్ణయించిన ప్రీమియంలో కేవలం 1.5 శాతం చెల్లిస్తే చాలు. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. 2016 జూన్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టానికి.. పూర్తి బీమా అందిస్తారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు రైతులు 5 శాతం ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు.
Key Elements in PMFBY: పొలంలో పంటకు జరిగిన నష్టంతో పాటు, విత్తనాలు వేయలేకపోవడం, పంటకోత తర్వాత జరిగే నష్టాలకు, వరద ముంపు వంటి విపత్తులకు బీమా వర్తిస్తుంది. పంట నష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతాన్ని నేరుగా అన్నదాతల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తారు. క్లెయిమ్ సెటిల్ కోసం పంట నష్టాన్ని అంచనా వేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా పంటకోత ఇన్ఫర్మేషన్ను ఫొటోలు తీసి, వెబ్సైట్లో అప్‌లోడ్ చేస్తారు.
పంటల బీమా పథకంలో కీలక మార్పులు!
Pradhan Mantri Fasal Bima Yojana: బ్యాంకు రుణాలు తీసుకున్నవారు పంట బీమా చేయడం ప్రస్తుతం తప్పనిసరి. కొత్త పథకం కింద రుణం తీసుకున్నవారూ, తీసుకోనివారూ బీమా చేయించుకోవచ్చు. ప్రభుత్వ రాయితీపై గరిష్ఠ పరిమితి లేదు. ప్రీమియం 90 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం భరిస్తుంది. ప్రీమియం ధరపై పరిమితిని విధిస్తున్న నిబంధన వల్ల రైతులకు తక్కువ క్లెయిమ్‌లు చెల్లిస్తుండటంతో ఆ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. బీమా చేసిన పూర్తి మొత్తాన్ని ఎలాంటి మినహాయింపులూ లేకుండా పొందుతారు. మొత్తం రాష్ట్రానికి ఒక బీమా కంపెనీ ఉంటుంది. కోతల తర్వాత ప్రకృతి విపత్తులతో జరిగే నష్టాలకు పొలం స్థాయిలో అంచనా వేస్తారు. భారత వ్యవసాయ బీమా సంస్థతో పాటు ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
పంటల బీమాతోనే రైతుకు భరోసా
ఫసల్ బీమాకు దరఖాస్తు చేయడం ఇలా..
- ముందుగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అధికారిక వెబ్సైట్ https://pmfby.gov.in/కి వెళ్లాలి.
- ఫార్మర్స్ కార్నర్లో "స్వయంగా పంటల బీమా కోసం అప్లై చేయడం(Apply For Crop Insurance by Yourself)" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- రైతు కోసం.. మొబైల్ నంబర్(Phone Number) లేదా గెస్ట్ ఫార్మర్(Guest Farmer)తో లాగిన్ చేస్తే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
- తదుపరి దశలో.. పేరు, వయస్సు, మొబైల్ నంబర్, లింగం, రైతు రకం, వర్గం, రైతు ఖాతా వివరాలు వంటి వివరాలను ఫిల్ చేయాలి.
- తర్వాత, క్రియేట్ యూజర్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ వివరాలు పూర్తి చేసిన తర్వాత అవి రైతుకు అందుతాయి.