తెలంగాణ

telangana

ETV Bharat / business

'పసిడి'పై ఇన్వెస్ట్​ చేస్తున్నారా? ఇప్పుడు సురక్షితమా.. కాదా?

Gold Investment: మూడు నెలల క్రితం వరకు బంగారం పెట్టుబడులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో పెట్టుబడులు సురక్షితమా.. కాదా అని తెలుసుకుందామా?

Buy gold on dips
బంగారం ధరలు

By

Published : Jun 11, 2022, 12:34 PM IST

gold investment: బంగారం ధరలకు అనుగుణంగా ట్రేడయ్యే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల విలువ గత మూడు నెలల్లో సగటున 3.5 శాతం దిద్దుబాటుకు గురయ్యింది. అయితే, ఏడాది క్రితం దీంట్లో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం మంచి రాబడినే ఆర్జించారు. కానీ, స్వల్పకాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు! మరి ఈ సమయంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సురక్షితం?

3 నెలల క్రితం సానుకూలం..:మూడు నెలల క్రితం బంగారంపై పెట్టుబడులకు వాతావరణం అనుకూలంగా ఉండింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు మరోసారి విజృంభించాయి. దీంతో చాలా మంది తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. మే నెలలో భారత్‌లో బంగారం దిగుమతులు 667 శాతం పెరిగాయి.

ఇప్పుడు ప్రతికూలం..:అయితే, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు డిసెంబరు నాటికి రేట్లను మరో రెండు శాతం పెంచే అవకాశం ఉందని అంచనా! దీంతో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది బంగారానికి ప్రతికూలాంశం. అందుకే స్వల్పకాలంలో బంగారంపై పెట్టుబడులు ఎలాంటి రాబడినివ్వకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మాంద్యం భయాలు ముసురుకుంటున్నాయ్‌..:అమెరికాలో వరుస రేట్ల పెంపు ఆర్థిక మాంద్యానికి దారితీసినట్లు చరిత్ర చెబుతోంది. కొన్నిసార్లు కేంద్ర బ్యాంకులు కఠిన ఆర్థిక విధాన వైఖరిని మధ్యలోనే వదిలేసి తిరిగి సర్దుబాటు వైఖరికి మారాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న రేట్ల పెంపు వ్యూహం ఏమాత్రం దెబ్బకొట్టినా అది బంగారానికి సానుకూలంగా మారుతుంది.

మదుపర్లు ఏం చేయాలంటే..?:స్వల్పకాలంలో బంగారంపై పెట్టుబడి ఆశాజనకంగా లేకపోయినప్పటికీ.. మన పోర్ట్‌ఫోలియోలో దీన్ని భాగం చేసుకోవాల్సిందే. ద్రవ్యోల్బణ భయాలను అధిగమించడానికి ఇదొక మంచి మార్గం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి గాడితప్పినా.. బంగారం మాత్రం మంచి రాబడినిస్తుంది. ఈ నేపథ్యంలో ధరలు ఏమాత్రం పడిపోయినా.. పసిడిని కొని పెట్టుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 10-15 శాతం వాటా ఉండాల్సిందే. ఒకవేళ అంతకంటే తక్కువగా ఉంటే.. ధరలు తగ్గిన ప్రతిసారీ దశలవారీగా బంగారాన్ని కొనిపెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనుగోలును పిల్లల పెళ్లిళ్ల వంటి లక్ష్యానికి జోడించుకుంటే మరింత ప్రయోజనం. అయితే, మీకు బంగారాన్ని వెంటనే నగదుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటే మాత్రం గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం ఉత్తమం.

కనీసం 8 ఏళ్ల లక్ష్యంతో బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మాత్రం ప్రభుత్వ పసిడి బాండ్లు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి వృద్ధి చెందడంతో పాటు ఏటా 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. అయితే, వీటి నుంచి మధ్యలో నిష్క్రమించడం మాత్రం అంత లాభదాయకం కాదు.

ఇవీ చదవండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

మార్కెట్లకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1017 పాయింట్లు డౌన్.. రూపాయి @ ఆల్​టైం లో!

ABOUT THE AUTHOR

...view details