స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు కోల్పోయి 40,894 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 11,992 పాయింట్లకు చేరుకుంది.
సెషన్ మధ్యలో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒకానొక దశలో 444 పాయింట్లు కోల్పోయి సెన్సెక్స్ 40,610.95 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 160 పాయింట్లకుపైగా నష్టపోయింది.
లాభ నష్టాల్లో..
కోల్ఇండియా, బీపీసీఎల్, గెయిల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, బజాజ్ ఆటో లాభాలు సాధించాయి.
బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి.
ఏజీఆర్ బకాయిలు..
ఏజీఆర్ బకాయిల విషయంలో వొడాఫోన్ ఐడియాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చర్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో టెలికాం, బ్యాంకింగ్ రంగాలు భారీగా నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్లు 16 శాతం పడిపోయాయి.
ఆసియా మార్కెట్లు కుదేలు..
కరోనా వైరస్ మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. ఆర్థిక వృద్ధిపై కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మదుపరులను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 1,868 మంది మరణించారు. కరోనా సోకిన వారి సంఖ్య 72,436కు చేరుకుంది.