తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆత్మనిర్భర్​ భారత్​ 3.0: ఉపాధి కల్పనకు పెద్ద పీట - Union Finance Minister news

Nirmala Sitharaman
నిర్మలా సీతారామన్

By

Published : Nov 12, 2020, 1:19 PM IST

Updated : Nov 12, 2020, 3:05 PM IST

13:07 November 12

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన

కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్​ భారత్'​ ఉద్దీపన చర్యల్లో భాగంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకునేలా చేసేందుకు ఉద్దేశించిన నిర్ణయాలను దిల్లీలో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్.

కరోనా టీకాపై పరిశధన, అభివృద్ధి కోసం బయోటెక్నాలజీ విభాగానికి కొవిడ్ సురక్షా మిషన్​ కింద రూ.900 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు నిర్మల.

ఆత్మ నిర్భర్​ భారత్​ 3.0

ఉద్దీపన చర్యల 3వ విడతలో భాగంగా 12 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు నిర్మల.

1. ఆత్మ నిర్భర్​ భారత్​ రోజ్​గార్ యోజన: కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం. ఈపీఎఫ్​ఐ పరిధిలోని సంస్థ కొత్త ఉద్యోగిని(గతంలో పీఎఫ్​లో చేరనివారు లేక ఉద్యోగం కోల్పోయిన వారు) చేర్చుకుంటే... సంస్థకు, ఉద్యోగికి పీఎఫ్ కంట్రిబ్యూషన్​లో రాయితీ​. అక్టోబర్​ 1 నుంచి ఈ నిర్ణయం అమలు. 

2. ఆత్మనిర్భర్ భారత్​ యోజనలో భాగంగా రూ.3లక్షల కోట్లు రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్​ 2021 మార్చి 31 వరకు పొడిగింపు.

3. 10 కీలక రంగాలకు ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా రూ.1.46 లక్షల కోట్లు అందజేత. ఇప్పటికే ప్రకటించిన పథకాన్ని విస్తరిస్తూ తాజా నిర్ణయం.

4. పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్​ యోజనకు అదనంగా రూ.18వేల కోట్లు కేటాయింపు. ఈ నిర్ణయంతో కొత్తగా 12 లక్షల ఇళ్లు నిర్మాణం ప్రారంభం, మరో 18 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి. అదనంగా 78 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం. స్టీల్, సిమెంట్​కు భారీగా పెరగనున్న డిమాండ్.

5. కాంట్రాక్టులపై పెర్ఫామెన్స్​ సెక్యూరిటీ 5 నుంచి 3 శాతానికి తగ్గింపు. ఈ నిర్ణయంతో నిర్మాణ, మౌలిక వసతుల అభివృద్ధి రంగంలోని గుత్తేదారులకు ఊరట. టెండర్లకు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టీకరణ. 2021 డిసెంబర్​ 31వరకు ఈ నిర్ణయం వర్తింపు.

6. ఇళ్ల నిర్మాణదారులు, కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్ను మినహాయింపు నిబంధనల్లో మార్పులు.

వేర్వేరు రంగాలకు ఊతం, ఊరట ఇచ్చేలా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. 

ఉందిలే మంచికాలం...

ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని గణాంకసహితంగా వివరించారు నిర్మల. వేర్వేరు రంగాల్లో సాధించిన వృద్ధి లెక్కలను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు.  ఆమె చెప్పిన కీలక విషయాలు:

  • ఏడాదికేడాది జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి
  • అక్టోబరులో రూ.లక్షా 5 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు
  • గత అక్టోబరుతో పోలిస్తే 10 శాతం అధిక జీఎస్టీ వసూళ్లు
  • ఏప్రిల్-ఆగస్టు వరకు 35.37 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి
  • గతేడాదితో పోల్చుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13 శాతం పెరిగాయి
  • కొవిడ్ యాక్టివ్ కేసులు 10 లక్షల నుంచి 4.89 లక్షలకు తగ్గాయి
  • కొవిడ్ మరణాల రేటు 1.47 శాతానికి తగ్గింది
  • విదేశీ మారకనిల్వలు 567 బిలియన్ డాలర్లకు పెరిగాయి
  • స్టాక్‌మార్కెట్లు రికార్డుస్థాయికి ఎగబాకాయి
  • ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది
  • 68.6 కోట్లమంది లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం

ఆత్మనిర్భర్ భారత్​లో భాగంగా ఇప్పటికే రెండు దఫాలుగా చేపట్టిన ఉద్దీపన చర్యలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు నిర్మల.

Last Updated : Nov 12, 2020, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details