ఆర్థిక మందగమనం, మాంద్యం భయాల నడుమ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ పలు కీలక సంస్కరణలు చేపట్టారు. ఆ చర్యలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఆమె.ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకున్నామని.. ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచించామని పేర్కొన్నారు. ఎంఈఐఎస్ పథకం అమలుతో రూ.50వేల కోట్ల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు.
ఎగుమతుల పెంపునకు 'నిర్మలమ్మ' వరం
ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకున్నామని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మోదీ 2.0 ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పారు నిర్మల.
మాంద్యం భయాలు వెంటాడుతోన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టంచేశారు నిర్మల. దేశంలో పెట్టుబడులు మరింత పెరగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019-20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయన్నారు ఆర్థిక మంత్రి. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందని.. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌తో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో కీలక రేట్లు తగ్గింపుతో సానుకూల ఫలితాలు వస్తాయన్నారు.