అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా లిమిటెడ్ షేరు ధర 5 రోజుల క్రితం రూ.136. కానీ సోమవారం స్టాక్ఎక్స్ఛేంజీలో ఈ షేరు ముగింపు ధర రూ.96.95. అయిదు రోజుల్లో ఇంత భారీగా వేదాంతా షేరు ధర పతనం కావటానికి ప్రధాన కారణం- డీలిస్టింగ్ ప్రక్రియ వెనక్కి పోవటమే. సోమవారం ఒక్కరోజు ఈ షేరు 20% పతనమైంది. ఒకపక్క కంపెనీకి రుణభారం అధికంగా ఉండటం, మరోపక్క డీలిస్టింగ్ ప్రక్రియ విఫలం కావటంతో మదుపర్లు ఈ షేర్‌ను విక్రయించినట్లు స్పష్టమవుతోంది.
ఇంతకీ వేదాంతా డీ-లిస్టింగ్ ఎందుకు విపలమైంది అంటే, దీనికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి.
- స్టాక్మార్కెట్లో నమోదైన (లిస్టింగ్)ఏదైనా ఒక కంపెనీ, ఆ లిస్టింగ్ రద్దు చేసుకుని బయటకు రావడాన్నే డీ-లిస్టింగ్ అంటారు. అది జరగాలంటే కంపెనీ జారీ చేసిన షేర్లలో కనీసం 90% షేర్లను వెనక్కి కొనుగోలు చేయాలి. డీ-లిస్టింగ్ కోసం వేదాంతా యాజమాన్యం వాటాదార్ల నుంచి 169.73 కోట్ల షేర్లు వెనక్కి కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. కానీ వాటాదార్లు 125.47 కోట్ల షేర్లు మాత్రమే ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే నిర్దేశించుకున్న షేర్లలో 90% షేర్లు (134 కోట్ల షేర్లు) రావాలి. అందువల్ల ఈ వ్యవహారం వెనక్కి పోయింది.
- వాస్తవానికి 137.78 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కానీ అందులో 125.47 కోట్ల షేర్లకు మాత్రమే అర్హత లభించింది. మిగిలిన 12.3 కోట్ల షేర్లకు సంబంధించిన బిడ్లు ఇన్వాలిడ్ అయ్యాయి. దీంతో కనీసం 90 శాతం షేర్లు రానట్లయింది.
- ఈ కంపెనీలో వాటాదార్లుగా ఉన్న దేశీయ సంస్థల్లో ఎల్ఐసీ ఒకటి. వేదాంతాలో ఎల్ఐసీకి 6.37% వాటా ఉంది. వేదాంతా డీ-లిస్టింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఎల్ఐసీ ఇష్టపడలేదని తెలుస్తోంది. ఈ షేర్‌కు రూ.140 విలువ ఉంటుందనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో ఉండగా, ఎల్ఐసీ మాత్రం కనీసం రూ.320 విలువ ఉన్నట్లు భావిస్తోంది.
- డీ-లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా రివర్స్ బుక్-బిల్డింగ్ పద్ధతిలో వాటాదార్లు తమ షేర్లను కంపెనీకి తిరిగి ఇచ్చే ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమై, 9న ముగిసింది. ఒక్కోషేర్‌కు కనీస ధర రూ.87.25 నిర్ణయించారు. వాస్తవిక విలువ కంటే ఈ ధర ఎంతో తక్కువగా ఉందనే ఉద్దేశంతో షేర్లు ఇవ్వటానికి ఎక్కువ మంది వాటాదార్లు ఆసక్తి చూపలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రస్తుతానికి డీ-లిస్టింగ్ ప్రతిపాదనను విరమించుకుని, ఇప్పటికే దాఖలైన షేర్లను సంబంధిత వాటాదార్లకు వెనక్కి తిరిగి ఇవ్వటానికి కంపెనీ సిద్ధమవుతోంది.