భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరుదేశాల కార్పొరేట్ దిగ్గజాలు కూడా తమ పెట్టుబడులపై పునరాలోచిస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. భారత ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో తనకున్న 30 శాతం వాటా విక్రయించాలని చైనా ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్ భావిస్తోంది. భారతీయ సంస్థ ఏదైనా కొనుగోలు చేస్తే, ఈ వ్యాపారం భారత చేతిలోనే ఉంటుంది. ఇక రిటైల్ రంగంలో పోటీకి ఉవ్విళ్లూరుతున్న టాటా గ్రూప్ కూడా బిగ్‌బాస్కెట్‌లో చైనా దిగ్గజం అలీబాబా సహా, ఇతర పెట్టుబడిదార్లకు ఉన్న 80 శాతం వాటా దక్కించుకోవడానికి తుదిదశ చర్చలు జరుపుతోంది.
టాటా గ్రూప్ గూటికి ఆన్‌లైన్ గ్రోసరీ సంస్థ బిగ్‌బాస్కెట్ చేరడం ఖాయమైంది. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను 1.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9800 కోట్ల)కు కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ తుదిదశ చర్చలు జరుపుతోంది. అంటే ఈ ప్రకారం బిగ్‌బాస్కెట్ విలువ 1.6 బిలియన్ డాలర్లు అవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.లావాదేవీ ప్రతిపాదన ప్రకారం.. చైనా రిటైల్ దిగ్గజం అలీబాబా (29 శాతం), ఇతర ముఖ్యమైన పెట్టుబడిదార్ల నుంచి 50-60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనుంది. అనంతరం బిగ్‌బాస్కెట్‌కు చెందిన 20-30 శాతం కొత్త షేర్లను కొనుగోలు చేయడం ద్వారా తాజా నిధులను టాటా గ్రూప్ చొప్పించనుంది.
ఇ-కామర్స్‌పై టాటాల ఆసక్తి
కొవిడ్-19 నేపథ్యంలో భారత ఇ-కామర్స్ విపణి గణనీయ వృద్ధి సాధిస్తోంది. నిత్యావసరాల కొనుగోళ్లు కూడా ఆన్‌లైన్‌లో పెరుగుతున్నందునే టాటా గ్రూప్ ఇ-కామర్స్ సంస్థలపై ఆసక్తి చూపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్‌మార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన జియోమార్ట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాల నుంచి పోటీ తట్టుకోవాలంటే, టాటా గ్రూప్ వంటి సంస్థల దన్ను బిగ్‌బాస్కెట్‌కు అనివార్యంగా కనిపిస్తోంది. ఒక్క కొనుగోలుతో నిత్యావసరాల్లో ఆన్‌లైన్ భారీ మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడం టాటా గ్రూప్ లక్ష్యంగా తెలుస్తోంది. టాటా గ్రూప్ తీసుకురావాలని భావిస్తున్న ‘సూపర్ యాప్’కు సైతం బిగ్‌బాస్కెట్ కొనుగోలు దోహదపడనుంది. సూపర్‌యాప్‌లో ఆహారం, నిత్యావసరాలు, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, బీమా, ఆర్థిక సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, బిల్లు చెల్లింపులు వంటి సేవలు ఉంటాయని వార్షిక సాధారణ సమావేశంలో టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించడం గమనార్హం.
ఇరు సంస్థల మధ్య ఒప్పంద పరిణామాలపై టాటా గ్రూప్, బిగ్‌బాస్కెట్‌లు స్పందించలేదు.