ఆర్థిక మందగమనం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో గృహ విక్రయాలు భారీగా క్షీణించినట్లు తెలుస్తోంది. రియల్టీ కన్సల్టేషన్ సంస్థ 'ప్రాప్ టైగర్' విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 30 శాతం క్షీణించాయి. ఈ సమయంలో 64,034 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే సమయంలో 91,464 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం.
గడిచిన మూడు త్రైమాసికాల్లోనూ అదే తీరు..
2019-20 తొలి తొమ్మిది నెలల్లో చూస్తే... రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ 13 శాతం తగ్గినట్లు తేలింది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, కోల్‌కతా, ముంబయి, పుణె, నోయిడా, అహ్మదాబాద్‌లలో చేసిన సర్వే ఆధారంగా ఈ నివేదిక విడుదల చేసింది 'ప్రాప్ టైగర్'.