దేశంలో విద్యుత్ వాహనాలకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 5 శాతానికే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల అవిష్కరణకు మొగ్గు చూపుతున్నాయి దిగ్గజ ఆటో మొబైల్ సంస్థలు.
హీరో ఎలక్ట్రిక్ ఇటీవల భారత్‌లో రెండు విద్యుత్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లో విడుదల చేసింది. బెంగళూరు విద్యుత్ వాహనాల హబ్‌గా భావిస్తున్నందున ముందుగా ఇక్కడ ఈ మోడళ్లను విడుదల చేసినట్లు వెల్లడించారు హీరో హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్. త్వరలోనే దేశవ్యాప్తంగా వీటిని విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ-వాహనాల విశేషాలు
హీరో ఎలక్ట్రిక్ విద్యుత్ స్కూటర్లు ఆప్టిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్‌లో కొత్తశ్రేణిని విపణిలోకి ప్రవేశపెట్టింది. ఆప్టిమా ఈఆర్ ధర రూ.68,721. ఎన్‌వైఎక్స్ ఈఆర్ ధర రూ.69,754 (ఎక్స్-షోరూమ్ ఇండియా)గా నిర్ణయించారు. పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 100 కి.మీ ప్రయాణం చేయొచ్చని, బ్యాటరీపై మూడేళ్ల వారెంటీ ఇస్తున్నామని కంపెనీ వెల్లడించింది.
ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం
ఈ కొత్త మోడల్ విద్యుత్ వాహనాలు ఒక్కసారి ఛార్జింగ్‌తో 110-115కి.మీ వరకు వెళ్లొచ్చని గిల్ తెలిపారు. పూర్తి ఛార్జింగ్‌కు నాలుగున్నర గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రత్యేకతలన్నింటితో ఈ బైకులను అభివృద్ధి చేశాం. ఈ బైకును కొనడం ప్రయోజనమేనా, ఇక్కడి రోడ్లకు ఇది అనువుగానే ఉంటుందా అని వినియోగదారుడి మదిలో నెలకొన్న ప్రశ్నలకు వీటితో సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నట్లు సోహిందర్ గిల్ తెలిపారు.
"విద్యుత్ వాహనాల ఛార్జింగ్‌కు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాలంటే నాలుగేళ్లు పట్టొచ్చని నా అభిప్రాయం. అయితే మా బైకుల విషయంలో ఛార్జింగ్ సమస్యకు విభిన్న పరిష్కారాన్ని చూపాం. అదేమిటంటే.. బ్యాటరీలను ఎక్కడి కంటే అక్కడికి తీసుకుని వెళ్లే (పోర్టబిలిటీ) వెసులుబాటు ఉండడం. ఈ బైకుల్లో రెండు బ్యాటరీలు ఉంటాయి. అవి కూడా తేలికపాటివి. ఆఫీసుల్లో, ఇంట్లో మొబైళ్ల ఛార్జింగ్ మాదిరి ఎప్పుడంటే అప్పుడు వీటిని ఛార్జి చేసుకోవచ్చు. అరగంట ఛార్జ్ చేసుకుంటే చాలు పదిహేను కిలో మీటర్ల వరకు వెళ్లొచ్చు. ఛార్జింగ్ స్టేషన్లలో రెండు గంటల పాటు నిల్చునే దాని కంటే ఇది మేలే కదా. అందుకే స్వల్పకాలం పాటు ఈ సమస్యకు ఇది ఓ తాత్కాలిక పరిష్కారమని మేం అనుకుంటున్నాం." -సోహిందర్ గిల్, హీరో ఎలక్ట్రిక్ సీఈఓ