తెలంగాణ

telangana

ETV Bharat / business

రివర్స్​ గేర్​: 600మంది ఉద్యోగులకు బలవంతపు సెలవు

అమ్మకాలు క్షీణించిన కారణంగా పలు ఆటో మొబైల్​ పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందుకోసం తమ ప్లాంట్లలో పని చేసే ఉద్యోగులకు వరుస సెలవులు ప్రకటిస్తున్నాయి. గురుగ్రామ్​లో ఉన్న మారుతీ సుజుకీ ప్లాంట్​లో పని చేసే 600 మంది సిబ్బందిని సెలవులపై పంపడమే ఇందుకు ఉదాహరణ.

600మంది ఉద్యోగులకు బలవంతపు సెలవు

By

Published : Aug 25, 2019, 1:02 PM IST

Updated : Sep 28, 2019, 5:09 AM IST

రివర్స్​ గేర్​: 600మంది ఉద్యోగులకు బలవంతపు సెలవు

ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభం నానాటికీ ముదురుతోంది. గత మూడు నెలల్లో వాహనాల అమ్మకాలు 20 నుంచి 25 శాతం క్షీణించాయి. ఫలితంగా గురుగ్రామ్​లో ఉన్న ప్లాంట్​లో ఉత్పత్తిని తగ్గించింది మారుతీ సుజుకీ. ఖర్చులు తగ్గించుకునేందుకు 600 మంది సిబ్బందికి సెలవులు ప్రకటించింది.

"కంపెనీ నుంచి మమ్మల్ని తీసేయలేదు. ఉత్పత్తి తగ్గించుకునేందుకు జులై నుంచి మమ్మల్ని సెలవుల్లో పంపారు. మొత్తం ఎంత మందిని పంపారో తెలియదు. నాతో పాటు 15 మంది వరకు సెలవుపై పంపారు."
- మారుతీ ఉద్యోగి

భారీగా తగ్గిన ఉత్పత్తి..

మార్కెట్​లో డిమాండ్ బాగా ఉన్నప్పుడు గురుగ్రామ్ ప్లాంట్​లో రోజుకు దాదాపు 6,000 కార్లు తయారయ్యేవి. ఇప్పుడు ఈ సంఖ్యను 4,500కు తగ్గించింది మారుతీ సుజుకీ. అయినప్పటికీ.. ఉత్పత్తయిన యూనిట్లు పూర్తిగా అమ్ముడవ్వడం లేదని తెలిపింది. పరిస్థితి చక్కబడితే వీలైనంత త్వరగా అందరినీ వెనక్కిరప్పిస్తామని ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

"జులై నుంచి 500-600 మంది ఉద్యోగులను సెలవులపై పంపాము. అమ్మకాలు తగ్గిన కారణంగా ఉత్పత్తి క్షీణించింది. గత ఐదారేళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్పత్తి క్షీణించింది. అందుకే వాళ్లను సెలవుపై పంపాము. మార్కెట్​ పుంజుకుంటే తిరిగి వారందరినీ వెనక్కి రప్పిస్తాము."
- మారుతీ ఉన్నతాధికారి

సంక్షోభానికి కారణాలు ఇవే..

జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు నిర్ణయాలే ఆటోమొబైల్​ పరిశ్రమ సంక్షోభానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. 28 శాతం జీఎస్టీతో అమ్మకాలు భారీగా క్షీణించాయి. అంతకుముందు వాహనాలకు రుణాలు త్వరగా లభించేవి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో రుణాలు లభించడం కష్టంగా మారింది. ఫలితంగా అమ్మకాలు తగ్గి.. సంక్షోభం ముదురుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ట్రాన్స్​పోర్ట్ రంగానికి నష్టమే..

ఆటోమొబైల్​ రంగ సంక్షోభంతో రవాణా రంగానికి నష్టాలు వస్తున్నాయి. మారుతీ సుజుకీ గురుగ్రామ్ ప్లాంట్​ నుంచి రోజుకు కనీసం రెండు నుంచి మూడు పెద్ద ట్రక్కుల్లో కొత్త కార్లు ఇతర ప్రాంతాలకు వెళ్లేవి. కానీ నెల నుంచి చాలా వరకు ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. వాటి నిర్వహణకు ఖర్చు చేయక తప్పడం లేదు. ఫలితంగా లక్షల్లో నష్టాలు వస్తున్నాయని అంటున్నారు ట్రక్కుల యాజమానులు.

ఆటో సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థకూ ముప్పే

దేశంలో ఉన్న అన్ని ఆటోమొబైల్ సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దేశ జీడీపీలో ఆటోమొబైల్​ పరిశ్రమ వాటా 7 శాతం. పారిశ్రామిక జీడీపీలో దీని వాటా 26 శాతంగా ఉంది. ఆటో మొబైల్ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ సంక్షోభం ఇలానే కొనసాగితే వారిలో చాలా మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంది.

ఇదీ చూడండి: ఈ చిన్న పొరపాట్లు చేయకుంటే మీరే కోటీశ్వరులు!

Last Updated : Sep 28, 2019, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details