బంగారం ధరలు నేడు తాజా రికార్డు నమోదు చేశాయి. గత సెషన్లో స్థిరంగా ఉన్న పుత్తడి ధర నేడు 10 గ్రాములకు రూ.300 పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,970లకు చేరింది. పండుగ సీజన్ కారణంగా దేశీయంగా నగల వ్యాపారుల నుంచి వచ్చిన భారీ డిమాండుతో పసిడి ధరలు పెరిగినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. అదే విధంగా అంతర్జాతీయంగా నెలకొన్న వృద్ధి భయాలతో మదుపరులు పసిడిపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తుండటమూ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.
కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.2,110 పెరిగి.. రూ.48,850కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదార్ల నుంచి వచ్చిన డిమాండు మేరకు వెండి ధరలు పుంజుకున్నాయి.