ఆటోమొబైల్ దిగ్గజం 'నిస్సాన్' మాజీ అధినేత కార్లోస్ ఘోసన్కు టోక్యో కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సంస్థలో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడినట్లు ఘోసన్పై ఆరోపణలున్నాయి.
ఆయన్ను 2018 నవంబర్ 19న జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు మూడు నెలలు జైల్లో గడిపిన తర్వాత అనూహ్య రీతిలో ఘోసన్కు బెయిల్ మంజూరైంది. 9 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో టోక్యోకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ దరఖాస్తులను తోసిపుచ్చిన కోర్టు మూడో సారి సానుకూలంగా స్పందించింది.
నిన్న ఘోసన్ తరపున వాదించిన కొత్త న్యాయవాది జునీచిరో హిరోనకా మీడియాతో మాట్లాడుతూ... ఈసారి బెయిల్ కోసం కొత్త కారణాలు జోడించినట్లు పేర్కొన్నారు. జపాన్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారందరి కేసులు వాదించే న్యాయవాదిగా హిరోనకాకు పేరుంది.
విదేశాలకు వెళ్లొద్దు
ఇతర దేశాలకు పారిపోయే అవకాశం, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు ఇంతకు ముందు తీర్పులో పేర్కొంది. ఆరోపణల నేపథ్యంలో ఘోసన్ జపాన్ విడిచి వెళ్లేందుకు వీల్లేదని షరతులు విధించింది టోక్యో కోర్టు.
నేనెందుకు సిగ్గుపడాలి: ఘోసన్
చాలా కాలం తర్వాత విదేశీ మీడియాతో మాట్లాడిన ఘోసన్ నిర్భందం పొడగింపు ఏ దేశంలోనైనా సాధారణమైన విషయమన్నారు. అలాంటప్పుడు "నాకు శిక్ష పడకముందే నేనెందుకు సిగ్గు పడాలి" అని ఘోసన్ అన్నారు.