తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ పెట్టుబడులతో స్వావలంబనా? - india economy and foreign investments

కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరచేందుకు చేపట్టిన చర్యలతో స్వయంసమృద్ధి సాధ్యమేనా? విదేశీ పెట్టుబడులు పెరిగితేనే అభివృద్ధి జరుగుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో సైతం ప్రజలందరూ సురక్షిత జీవనం సాగించేందుకు సంపదను, వనరులను మరింత సమానంగా పంచే ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంత?

foreign-investments-for-indian-economy-development-is-not-appropriate
మన విధానాలు మార్చాలా? విదేశీ పెట్టుబడులే కావాలా?

By

Published : Jun 30, 2020, 11:40 AM IST

స్వావలంబనతో సరళమైన జీవనం సాగించడమే స్వయంసమృద్ధి అని మహాత్మాగాంధీ అభిప్రాయపడ్డారు. స్థానిక వనరులను, శ్రామికులను ఉపయోగించుకుంటూ, స్థానిక అవసరాలు, వినియోగం కోసం సరకులను ఉత్పత్తి చేసుకోవడమే స్వావలంబన వెనక ఉన్న ప్రాథమిక సూత్రం. కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరచేందుకుచేపట్టిన చర్యలు- మనల్ని గాంధీ విలువలకు, స్వయంసమృద్ధి భావనకు మరింత దూరం చేస్తోంది.

సమానంగా పంచాలి....

కొవిడ్‌ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ప్రజారోగ్యం, ప్రైవేటు ఆరోగ్య రంగాల మధ్య ఎలాంటి అనుబంధం ఉందనేది తేటతెల్లమైంది. దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోకన్నా ప్రైవేటు రంగంలో వెంటిలేటర్లు, వైద్యుల సంఖ్య, ఆస్పత్రి పడకలు అధికంగా ఉన్నాయి.లాక్‌డౌన్‌, తదనంతర పరిణామాలతో ఆర్థిక విపత్తు సంభవించవచ్చేమోనని కొంతమంది భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యపడాలంటే- మన ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలో వ్యవస్థీకృత మార్పులు రావాలి. ప్రస్తుత క్లిష్ట తరుణంలో సైతం ప్రజలందరూ గౌరవప్రదమైన, సురక్షిత జీవనం సాగించేందుకు సంపదను, వనరులను మరింత సమానంగా పంచే ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సి ఉంది. ఎలాంటి సామాజిక, ఆర్థిక స్థాయులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవల్ని అందించే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలి.

మన విధానాలు మార్చాలా? విదేశీ పెట్టుబడులు కావాలా?

ప్రతికూల ప్రభావాలు...

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ఆస్పత్రులు, పాఠశాలలు వంటి సామాజిక రంగ మౌలిక సదుపాయాల కోసం ప్రైవేటు రంగంలో పెట్టుబడులకు ఉత్తేజాన్నిచ్చేందుకు రూ.8,100 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రక్షణ, విద్యుత్తు, అంతరిక్షం, బొగ్గు గనులు తదితర రంగాల్లో ప్రైవేటుకు తలుపులు బార్లా తెరిచారు. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల్ని రద్దు చేసే దిశగా అడుగేశాయి. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల్ని మెరుగుపరచే యత్నంలో భాగంగా... వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేయాలని, ప్రైవేటు భాగస్వాముల సాయంతో జిల్లా ఆస్పత్తుల్లో సేవల్ని పెంచాలని నీతిఆయోగ్‌ రాష్ట్రాలను కోరింది. ఇలాంటి చర్యలు ప్రతికూల ప్రభావం కనబరుస్తాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్వయంసమృద్ధి దిశగా సాగడంలో భాగంగా రక్షణ తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సామర్థ్యాన్ని పెంచలేవు..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సంప్రదాయ నయా ఉదారవాద విధానాలు స్వయంసమృద్ధి భావనకు ఎలా ప్రతికూలంగా వ్యవహరిస్తాయనేది తెలిపేందుకు వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమే చక్కని ఉదాహరణ. వైద్య ఉపకరణాల తయారీ రంగంలోకి 2015 నుంచి వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతించారు. అప్పట్నుంచి, మనదేశంలోకి వచ్చే చాలా వరకు ఎఫ్‌డీఐలు ఆర్థిక దిగుమతులు, వాణిజ్యం, నిల్వ, పంపిణీ మౌలిక సదుపాయాలు వంటివే తప్పించి- దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేవి కావు. ఇవి- అంతర్జాతీయ వైద్య ఉపకరణాల తయారీదారులు స్థానిక పారిశ్రామిక అభివృద్ధికి ఏమాత్రం తోడ్పాటు అందించకుండానే, భారత మార్కెట్లో తమ వస్తువుల్ని అమ్ముకొని భారీ లాభాలు పొందేందుకు తోడ్పడ్డాయి.

ప్రభుత్వ ఆస్పత్రులతో సహా మన దేశంలో ఉపయోగించే వైద్య ఉపకరణాల్లో 80 శాతం వరకు దిగుమతి చేసుకున్నవే. ఎలెక్ట్రానికేతర వైద్య ఉపరణాలను తయారు చేసే సామర్థ్యం కొంతమేర ఉన్నప్పటికీ, 90 శాతం వైద్య ఎలెక్ట్రానిక్‌ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారు. భారత్‌లో ఉత్పత్తవుతున్న ఉపకరణాలను నాసిరకమైనవిగా పరిగణిస్తున్నారు. పలువురు వైద్యులు విదేశీ వస్తువులవైపే మొగ్గు చూపుతున్నారు.

విధానాల మార్పే కీలకం..

భారత వైద్య ఉపకరణాల పరిశ్రమ సంఘం వంటి ఉత్పత్తిదారుల సంస్థలు కస్టమ్స్‌ సుంకాల్ని పెంచాలని, ముందుగానే ఉపయోగించిన వస్తువుల దిగుమతుల్ని నిషేధించాలని డిమాండు చేస్తుంటాయి. దేశీయంగా ఉత్పత్తి చేసిన వస్తువులకు ప్రాధాన్య ధర ఇవ్వాలని, దిగుమతి ఉపకరణాల గరిష్ఠ చిల్లర ధరపై నియంత్రణలు ఉండాలని, ఫలితంగా దేశీయ ఉత్పత్తి నాణ్యత, పరిమాణం పరంగా ప్రోత్సాహం అందుతుందని కోరుతున్నా ఫలితం ఉండటం లేదు. ఉత్పత్తి నాణ్యతను మెరుగు పరచుకునేందుకు దేశీయంగా పరిశోధనలను ప్రోత్సహించాలి. స్థానికుల సమస్యలపై అవగాహన కలిగిన వైద్య సాంకేతిక పరిజ్ఞానాల్ని అభివృద్ధి చేసే దిశగా దేశీయ పరిశోధనలను ప్రోత్సహించడం చాలా కీలకం. మన ప్రభుత్వ సంస్థల్లో పరిశోధనల నాణ్యత పెరిగేలా పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉంది. స్వయంసమృద్ధి అనేది విధానపరమైన మార్పుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. బహుళజాతి సంస్థల ప్రయోజనాల్ని నిరుత్సాహపరిచే, ప్రజలే కేంద్రంగా, వికేంద్రీకృత పారిశ్రామికీకరణ పద్ధతులతో, స్థానిక ఆర్థిక వ్యవస్థల వృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రభుత్వ పరిశోధన, నవకల్పనల మెరుగుదలతో కూడిన విధాన నిర్ణయాలతోనే స్వావలంబన సుసాధ్యమవుతుంది!

-సందీప్‌ పాండే

(రచయిత- రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

ఇదీ చదవండి:ఆర్థికం తెలియకున్నా.. అందులోనూ తనదైన ముద్ర

ABOUT THE AUTHOR

...view details