తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2020: నిర్మల బడ్జెట్​తో 'ఆటో' గేర్​ మారుతుందా?

ఈ దశాబ్దంలోనే అత్యంత గడ్డు పరిస్థితిని గత ఏడాది నుంచి ఎదుర్కొంటోంది వాహన రంగం. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు కావాలని వాహన పరిశ్రమ కోరుతోంది. ఇంతకీ వాహన రంగం కోరుకుంటున్న ప్రోత్సాహకాలు ఏంటి? వాటితో ప్రయోజనమెంత? నిపుణులు ఏమంటున్నారు?

auto
ఆటో సంక్షోభం

By

Published : Jan 29, 2020, 8:03 PM IST

Updated : Feb 28, 2020, 10:39 AM IST

తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వాహన రంగాన్ని ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. లేకపోతే దేశంలోనే రెండో అతిపెద్దదైన ఈ రంగం ఇప్పట్లో కోలుకొనే పరిస్థితి లేదు. ముఖ్యంగా వాహన రంగంలో ఆకర్షణీయమైన స్క్రాప్‌ పాలసీని తొందరగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆటోమొబైల్‌ రంగంలో కొనుగోళ్లు వేగవంతమవుతాయి. ఇప్పటికే 'ద సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్​)' ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేసింది.

మంచి రాయితీలతో కూడిన స్క్రాపింగ్‌ పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తే పాత వాహనాలను వదిలించుకొని ప్రజలు కొత్త వాహనాలకు మళ్లుతారని.. అప్పుడు ఆటోమొబైల్‌ పరిశ్రమ పుంజుకొంటుందని భావిస్తోంది సియామ్. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను వదిలించుకున్న వారికి జీఎస్టీలో 50శాతం రాయితీ, రోడ్డు పన్నులో మరో 50శాతం రాయితీ ఇవ్వాలని అడుగుతోంది. ప్రయాణికుల వాహనాలపై తరుగుదలను 25శాతం పెంచాలని డిమాండ్‌ చేసింది.

దీంతో పాటు ప్రభుత్వ హయాంలోని రవాణా శాఖలు ఐసీఈ బస్సులు కొనేలా కేటాయింపులు చేయాలని సియామ్ కోరింది. ఫెమ్‌-2 స్కీం కింద విద్యుత్తు బస్సులు కొనేలా చూడాలని సూచించింది. ఇప్పటికే బీఎస్‌6 నిబంధనలు అమల్లోకి రానుండటం వల్ల వాహన ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జీఎస్టీ రేట్లను 28శాతం నుంచి 18శాతానికి తీసుకురావాలని పరిశ్రమ కోరుతోంది. దీంతోపాటు విద్యుత్తు వాహనాలకు వినియోగించే లిథియం అయాన్‌ సెల్స్‌పై 5శాతం పన్నును తొలగించాలని కోరింది. ఈ చర్య దేశీయంగా బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఊతం అందిస్తుంది.

కొన్నాళ్ల నుంచి ఆటోమొబైల్‌ రంగం కొనుగోళ్లు లేక ఇబ్బంది పడుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో 16,17,398 వాహనాలు విక్రయించగా.. ఈ డిసెంబర్‌లో 14,05,776 వాహనాలు విక్రయించారు. 2019లో సంవత్సరంలో 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ముఖ్యంగా వాణిజ్య వాహనాల విక్రయం 2018 డిసెంబర్లో 75,984 ఉండగా.. గత డిసెంబర్లో 12శాతం తగ్గి 66,622కు చేరింది. ఇక మొత్తం వాహనాల ఉత్పత్తి కూడా 18,16,112కి తగ్గింది. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు 5.22శాతం తక్కువ అన్నమాట. ఆ మేరకు ఉద్యోగాలకు కూడా కోతపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఎన్‌బీఎఫ్‌సీల ప్రభావం..

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వాహన కొనుగోళ్లకు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు అత్యధికంగా అప్పులు ఇస్తున్నాయి. మూడింట ఒక వంతు కొనుగోళ్లు వీటి అప్పులతోనే జరుగుతాయి. కానీ, ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పుడు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కోవడం వల్ల రుణ లభ్యత తగ్గింది. దీంతో కొనుగోళ్లు పడిపోయాయి. బ్యాంకులు వాహన కొనుగోళ్ల నిబంధనలను కఠిన తరం చేయడం కూడా పులిమీద పుట్రలాగా మారింది.

బీఎస్‌-6 కోసం ఎదురు చూపులు

ఈ ఏడాది నుంచి బీఎస్‌6 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో చాలా మంది వాహన కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఫలితంగా అమ్మకాలు పడిపోయాయి. ఇప్పటికే ఉన్న వాహనాల పరిస్థితి ఏమిటి? అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడం దీనికి మరో కారణం. ఇప్పటికే దిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ఇంకా బీఎస్‌-6 ఇంధనం అందుబాటులోకి రాలేదు.

కంపెనీలు కూడా తమ సాంకేతికతను బీఎస్‌-6కు అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో మార్కెట్లో వాహనాల డిమాండ్‌ పడిపోవడం వాటిని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తోంది. బీఎస్‌-6 నిబంధనలు ముఖ్యంగా డీజిల్‌ ఇంజిన్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. పెట్రోల్‌ ఇంజిన్ల ధరలు రూ.30వేల వరకు పెరిగితే.. డీజిల్‌ ఇంజిన్ల ధరలు రూ.1లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. వీటి జీవిత కాలాన్ని ఇప్పటికే దిల్లీలో 10 ఏళ్లకు కుదించారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తారనే భయాలు ఉన్నాయి.

ట్రాక్టర్ల కొనుగోళ్లపై..

వ్యవసాయ రంగం కూడా పెద్ద ఆశాజనకంగా లేకపోవడం వల్ల ట్రాక్టర్ల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. వరదలు, కరవు వంటి సంక్షోభ పరిస్థితుల దెబ్బకు వ్యవసాయరంగం కుదేలైంది. సాధారణంగా ట్రాక్టర్ల విభాగంలో చాలా అరుదుగా కొనుగోళ్లు తగ్గుతాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా ట్రాక్టర్ల విక్రయాలు, ఎస్కార్ట్స్‌ విక్రయాలు కూడా తగ్గుముఖం పట్టాయి.

యాక్సెల్‌ లోడ్‌ నిబంధన మార్పుతో..

ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు యాక్సెల్‌ లోడ్‌ నిబంధనల్లో ఇటీవల మార్పులు తీసుకొచ్చింది. దీంతో వాణిజ్య వాహనాలు మోసే బరువు పరిమితి పెరిగింది. ఇది ఒక రకంగా ఇంధన వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. కానీ, కొత్త వాహన కొనగోళ్లు (ట్రక్కులు, ట్యాంకర్లు వంటివి) గణనీయంగా తగ్గాయి. ఈ దెబ్బకు అశోక్‌ లేలాండ్‌ పంత్‌నగర్‌ ప్లాంట్‌ను రోజుల తరబడి మూసేయాల్సి వచ్చింది. టాటామోటార్స్‌ కూడా పంత్‌నగర్‌ ప్లాంట్‌ను కొన్నాళ్లు మూసేసింది.

ఆఫర్లపై ఆశలు..

బీఎస్‌6 అమలుకు ముందు ఉన్న బీఎస్‌4 స్టాక్‌ను వదిలించుకోవడానికి కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తాయని వినియోగదారులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో అప్పటి వరకు వేచి ఉండాలనే ధోరణి అవలంబిస్తున్నారు. గతంలో కూడా జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పుడు, బీఎస్‌3 వాహనాల విక్రయాన్ని నిషేధించినప్పుడు 2017లో కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

క్యాబ్‌ సేవల ఎఫెక్ట్‌..

ఆటో పరిశ్రమపై క్యాబ్‌ సేవల ఎఫెక్ట్‌ భారీగానే ఉంది. ఈ సేవలు విస్తరించే కొద్దీ .. సొంత వాహన కొనుగోళ్లపై ఆసక్తి తగ్గుతోంది. ఉబర్‌, ఓలా యాప్‌ల్లో గతంలో కేవలం కార్లను మాత్రమే బుక్‌ చేసుకొనే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు అవి ఆటో రిక్షాలు, మోటార్‌ బైక్‌లను బుక్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్‌ పెరగడం కారణంగా ఉద్యోగాలు చేసే యువత చాలా సేపు డ్రైవింగ్‌లో సమయం వృథా చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. దీంతో కార్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. పార్కింగ్‌ సమస్యలు, ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కావడం వంటివి కూడా ఆటో పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వాలు కూడా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. చాలా నగరాల్లో ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులోకి రావడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతోంది. దిల్లీలో మహిళలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ఉచిత ప్రయాణాలను ఇవ్వడం వంటి చర్యలు కూడా వాహన రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అంశమే.

విద్యుత్త వాహనాలకే ఊతం..

ఈ సారి ఆటోమొబైల్‌ పరిశ్రమ జీఎస్టీ తగ్గింపును ఆశించింది. కానీ, ప్రభుత్వం విద్యుత్తు వాహనాలకు మాత్రమే జీఎస్టీని తగ్గించింది. దీంతో చాలా మంది భవిష్యత్తులో ప్రభుత్వం కచ్చితంగా జీఎస్టీని తగ్గిస్తుందని నమ్ముతున్నారు. ఆ తగ్గింపు ప్రకటన కోసం వేచిచూస్తూ వాహన కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌ 2020లో జీఎస్టీ తగ్గించాలని సియామ్ కూడా కోరింది.

ఆర్థిక సంక్షోభ భయాలు..

ఆర్థిక మందగమనం ముదిరి మాంద్యం ముంచుకొస్తోందనే భయాలు మార్కెట్లను ఊపేస్తున్నాయి. దీంతో చాలా మంది వ్యయాలను తగ్గించుకొని పొదుపుబాట పడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు ఈ విభాగంలోకి వస్తారు.

సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ నుంచి పోటీ..

గత ఐదేళ్ల నుంచి సెకండ్‌ హ్యాండ్‌ వాహన మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది కొత్త వాహనాల కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మరోపక్క కొత్త కాలుష్య నిబంధనల కారణంగా వాహన ధరలు పెరుగుతున్న సమయంలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ వినియోగదారులకు బలమైన ఎంపికగా మారింది.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఆటో పరిశ్రమను గాడిన పెట్టేందుకు నిర్మలా సీతారామన్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి:వొడా-ఐడియాకు బై- జియోకు జై... ఎందుకిలా?

Last Updated : Feb 28, 2020, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details