తెలంగాణ

telangana

ETV Bharat / business

రాబోయే బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గిస్తారా?

2020-21 కేంద్ర బడ్జెట్​పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో రెండోసారి పద్దు ప్రవేశ పెట్టనున్నారు.

NIRMALA
నిర్మాలా సీతారామన్​

By

Published : Jan 2, 2020, 9:20 AM IST

Updated : Jan 2, 2020, 9:46 AM IST

రాబోయే బడ్జెట్‌లో వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏమైనా వరాలు కురిపిస్తారా? ఆదాయపు పన్ను తగ్గిస్తారా? ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఫిబ్రవరి 1న ఆమె తన రెండో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఓ వైపు ఆర్థిక మందగమనం.. మరోవైపు కార్పొరేట్‌ పన్ను కోతను గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో బడ్జెట్లో పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

ఎందుకంటే..

నిర్మలా సీతారామన్‌ మొదటి బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కించే చర్యలేవీ (2019, జులై 5న) లేవనే మాట అప్పట్లో బాగా వినిపించింది. దీనికి సమాధానమో లేదంటే ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతోనో మొత్తానికి సెప్టెంబరులో కార్పొరేట్‌ పన్నును ఆమె బాగా తగ్గించారు. ఈ ఒక్క నిర్ణయంతో ఖజానాపై రూ.1.45 లక్షల కోట్ల మేర ప్రభావం పడనుంది.

మరోవైపు 2019లో చాలా వస్తువులపై వస్తు, సేవల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. స్థిరాస్తి, విద్యుత్‌ వాహనాలు, హాస్టల్‌ వసతి, వజ్రాల తయారీ, అవుట్‌డోర్‌ కేటరింగ్‌ లాంటివి ఇందులో ఉన్నాయి.

జీఎస్టీ, కార్పొరేట్‌ పన్నును తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వినియోగం నెమ్మదించడం కారణంగా పన్నుల వసూళ్లపై ప్రభావం పడింది. దీంతో ఆదాయ లక్ష్యాలను సాధించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది.

అయితే ఈ విషయాలపై పెద్దగా ఆలోచన చేయని సామాన్య ప్రజలు మోదీ 2.0 ప్రభుత్వం తమకూ పన్నుల వరాలు ప్రకటిస్తుందనే ఆశతో ఉన్నారు.

మాకూ తగ్గించరా?

కార్పొరేట్లకు కార్పొరేట్‌ పన్ను, అంకురాలకు ఏంజెల్‌ ట్యాక్స్‌, వ్యాపారులకు జీఎస్‌టీ, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లకు సర్‌ఛార్జీ విధించి మళ్లీ ఉపసంహరించుకోవడం.. ఇలా అందరికీ ప్రోత్సాహకాలు అందించినప్పుడు తమకు పన్ను తగ్గిస్తే బావుంటుదని వేతన జీవులు కోరుకుంటున్నారు.

గత బడ్జెట్లో సంవత్సరానికి రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లించనక్కర్లేదనే ప్రతిపాదన చేశారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను ఏడాదికి రూ.40,000 నుంచి రూ.50,000కి పెంచారు. ఇప్పుడు మరిన్ని ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత మందగమన పరిస్థితులు, ఇప్పటికే తగ్గించిన పన్నులతో ఆదాయంపై పడుతోన్న భారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం వేతనజీవులకు పన్నులు తగ్గించకపోవచ్చనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. అదే సమయంలో వినియోగం నెమ్మదించినందున ఆదాయపు పన్ను తగ్గిస్తే మరింత డబ్బు వ్యవస్థలోకి వచ్చి వినియోగం పెరిగే అవకాశం ఉండ కారణంగా పన్ను కోత దిశగా నిర్ణయం తీసుకోవచ్చని మరికొందరు అంటారు. చూడాలి మరి.. నిర్మలా సీతారామన్‌ మొగ్గు ఎటు వైపోనని.

ఇదీ చూడండి:డిసెంబర్​లో పుంజుకున్న వాహన విక్రయాలు

Last Updated : Jan 2, 2020, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details