భారత విమానయాన రంగం, దానిపై ఆధారపడిన పరిశ్రమల్లో 29 లక్షలకు పైగా ఉద్యోగాలపై కరోనా ప్రభావం పడవచ్చని అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఐఏటీఏ అంచనా వేస్తోంది. మే 3 వరకు లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో భారత్‌లో వాణిజ్య విమాన సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తితో విమానయాన, పర్యాటక రంగాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావమే పడింది. దీనిపై అంతర్జాతీయ విమాన రవాణా సంఘం(ఐఏటీఏ) తాజాగా వెలువరచిన అంచనాల ప్రకారం..
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కొవిడ్-19 సంక్షోభం వల్ల భారత్‌లోనూ పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. దేశ విమానయాన పరిశ్రమ, దానిపై ఆధారపడ్డ పరిశ్రమల్లో 29,32,900 వరకు ఉద్యోగాలకు ఇబ్బంది ఎదురుకావొచ్చు.
- భారత్ నుంచి, భారత్‌కు నిర్వహిస్తున్న విమానయాన సంస్థల ఆదాయాల్లో 2020లో 11.221 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.85,000 కోట్లు) మేర గండి పడే అవకాశం ఉంది. 2019తో పోలిస్తే ప్రయాణికుల రద్దీ బాగా తగ్గడం ఇందుకు నేపథ్యం.
- అంతర్జాతీయ విమానయాన ప్రయాణికుల ఆదాయాలు ఈ ఏడాది 314 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చు. 2019తో పోలిస్తే ఇది 55 శాతం తక్కువ.
- అంతర్జాతీయంగా చూస్తే ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 113 బిలియన్ డాలర్ల మేర ఆదాయ క్షీణత కనిపించవచ్చు.
- గత మూడు నెలలుగా పలు ప్రయాణ ఆంక్షలను విధించిన నేపథ్యంలో ఈ అంచనాలను వెలువరించాం. పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. రెండో త్రైమాసికంలో విమానయాన సంస్థలకు తీవ్ర ద్రవ్య కొరత ఎదురుకావొచ్చు.
- భారత, ఇండోనేషియా, జపాన్, మలేషియా, ఫిలిప్పీన్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌లలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సహాయం, రుణాలు, రుణ హామీలు, కార్పొరేట్ బాండ్ మార్కెట్‌కు మద్దతు, పన్ను ఊరటలను కలిగించాల్సిన ఉంది.