సరిహద్దుల్లో చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు డిజిటల్ యుద్ధానికి తెరతీసింది భారత్. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న టిక్‌టాక్ సహా 59 ప్రధాన మొబైల్ యాప్‌లను నిషేధించింది. అయితే చైనా సంస్థలకు చెందిన పబ్జీ వంటి కొన్ని ప్రముఖ యాప్‌లు మాత్రం ఈ జాబితాలో లేకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పబ్జీని ఎందుకు బ్యాన్ చేయలేదు..?
భారత్‌లో పబ్జీ బ్యాన్ చేయకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిఘా సంస్థలు ఇప్పటికే ఈ యాప్‌ను సునిశితంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. పబ్జీ వల్ల ప్రస్తుతం ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని గుర్తించినట్లు తెలుస్తోంది.
మరో కారణం ఈ యాప్ పూర్తిగా చైనా కంపెనీకి చెందినది కాదు. దీన్ని తయారు చేసి యాప్ నిర్వహణ చూస్తోంది బ్లూ హోల్ అనే దక్షిణ కొరియా సంస్థ. అయితే ఈ గేమ్ బాగా పేరు తెచ్చుకున్నాక చైనాకు చెందిన టెన్సెంట్ సంస్థ.. బ్లూ హోల్‌తో కలిసింది. చైనా, భారత్‌లో ఈ గేమ్‌ను మార్కెటింగ్ వ్యవహారాలను టెన్సెంట్ చూసుకుంటోంది. ఇలా మిక్స్డ్ ఓనర్షిప్ వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.