తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​ ఉద్యోగులు ఇక శాశ్వతంగా ఇంటి నుంచే! - వర్క్​ ఫ్రం హోం పై ట్విట్టర్​ కీలక నిర్ణయం

ప్రపంచ దేశాలన్నీ కరోనా నియంత్రణలో భాగంగా లాక్​డౌన్​ విధించిన వేళ.. ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​ కీలక ప్రకటన చేసింది. లాక్​డౌన్​ ఆంక్షలు ఎత్తివేసినా తమ ఉద్యోగులకు ఇకపై శాశ్వతంగా 'వర్క్​ ఫ్రమ్​ హోం' వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Twitter Will Allow Employees To Work From Home forever
'మా ఉద్యోగులకు శాశ్వతంగా 'వర్క్​ ఫ్రం హోం'కు అనుమతి'

By

Published : May 13, 2020, 3:29 PM IST

ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం 'ట్విట్టర్‌' లాక్‌డౌన్‌ నేపథ్యంలో సంచలన విషయం ప్రకటించింది. భవిష్యత్తులో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు (వర్క్‌ ఫ్రం హోం) అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన ఆంక్షల కారణంగా తమ ఉద్యోగులు 'వర్క్‌ ఫ్రం హోం' చేసేందుకు మార్చిలో తొలిసారి అనుమతించింది సంస్థ. అప్పటి నుంచి చాలా మంది ఇంటి నుంచే వారి సేవల్ని అందిస్తున్నారు. ఇది సత్ఫలితాలిస్తుండడం వల్ల భవిష్యత్తులోనూ ఇదే విధానం కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అందుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ఉద్యోగులకు కల్పిస్తామని వివరించింది. అయితే, తప్పనిసరి కార్యాలయాలకు రావాల్సిన వారికి మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.

ఇదో నిదర్శనం...

కరోనా వైరస్‌ విజృంభణ ఇంకా కొనసాగుతున్న వేళ.. సెప్టెంబరు వరకు తమ కార్యాలయాల్ని తెరిచేది లేదని ట్విట్టర్‌ స్పష్టం చేసింది. ఈ సంవత్సరాంతం వరకు తమ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇటీవలే గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు ప్రకటించాయి. ట్విట్టర్ ‌ మరో అడుగు ముందుకేసి శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో మారనున్న పనితీరుకు ట్విట్టర్‌ తాజా నిర్ణయం ఓ నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details