బ్యాంకింగ్ రంగంలోని పాలనను మెరుగుపర్చడంలో భాగంగా భారతీయ రిజర్వు బ్యాంకు కీలక సంస్కరణలకు నాంది పలికింది. బ్యాంకుల సీఈఓలు, పూర్తిస్థాయి డైరెక్టర్ల(డబ్ల్యూటీడీ) వయస్సు 70ఏళ్లకు మించకుండా ఉండాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తే వారి పదవీకాలం పదేళ్లకు మించి ఉండకూడదని పేర్కొంది.
పదేళ్లు పూర్తైన తర్వాత నాయకత్వ బాధ్యతలను నిపుణులకు అందించాలని తాజాగా విడుదల చేసిన చర్చా పత్రంలో రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది.
" బ్యాంకుల సీఈఓలు, పూర్తిస్థాయి డైరెక్టర్ల వయోపరిమితి 70 సంవత్సరాలు. ఈ వయసు దాటిన వారు ఆయా పదవుల్లో కొనసాగడానికి వీలులేదు. బ్యాంకు కార్యకలాపాలను చక్కదిద్దడానికి వాటాదార్లకు, ప్రమోటర్లకు పదేళ్ల సమయం లభిస్తుంది. కార్యకలాపాలు స్థిరత్వం పొందిన తర్వాత ఈ బాధ్యతలను వృత్తి నిపుణులకు బదిలీ చేయాలి. ఈ చర్యలు.. బ్యాంకుల నిర్వహణ నుంచి యాజమాన్యాన్ని వేరుచేయడమే కాకుండా.. వృత్తి నిర్వహణ సంస్కృతిని బలోపేతం చేస్తాయి."
-భారతీయ రిజర్వు బ్యాంకు