World Economic Forum: ప్రపంచ ఆర్థిక సదస్సుకు వర్చువల్‌గా హాజరై 'స్టేట్ ఆఫ్ ద వరల్డ్' అంశంపై ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా వల్ల ఆర్థిక, సరఫరా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. కరోనా పరిణామాలపై జీ20 సదస్సులో చర్చలు జరగాలని సూచించారు.
" ప్రపంచవ్యాప్త పరిణామాలపై చర్చలు జరగాలి. ప్రపంచ మేలు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. కొవిడ్ వేళ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ చేశాం. భారత్‌లో ఏడాదిలో 160 కోట్ల టీకా డోసులు పంపిణీ చేపట్టాం. భారత్‌లో ప్రస్తుతం కొవిడ్ మూడో దశ నడుస్తోంది. కొవిడ్ సమయంలోనూ సంస్కరణలు అమలు చేశాం. భారత్ ఆర్థికపరంగా ఆశావహ దృక్పథంతో ముందుకెళ్తూ.. ప్రపంచానికి కూడా ఆశావహ దృక్పథం కల్పిస్తోంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రజాస్వామ్యంపై భారతీయులకు గట్టి నమ్మకం ఉందన్నారు ప్రధాని మోదీ. కరోనాపై కలిసికట్టుగా పోరాడుతున్నట్లు చెప్పారు. భారత్ ప్రస్తుత అవసరాలే కాకుండా వచ్చే 25 ఏళ్లలో చేపట్టాల్సిన అంశాల ఆధారంగా విధానాలను రూపొందిస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కాలంలో జరిగే అభివృద్ధి 'పర్యావరణహిత, స్థిరమైన, నమ్మకమైనది'గా పేర్కొన్నారు. వచ్చే 25 ఏళ్లలో ప్రజల సంక్షేమం, శ్రేయస్సుతో పాటు అభివృద్ధి కోసం లక్ష్యాలు పెట్టుకున్నట్లు చెప్పారు.
కరోనా మహమ్మారి మూడో వేవ్‌పై అత్యంత అప్రమత్తత, జాగ్రత్తలతో పోరాడుతూనే ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు మోదీ. సరైన దిశలో సంస్కరణలు చేపట్టటంపై భారత్ దృష్టిసారించిందని, భారత్ తీసుకుంటున్న నిర్ణయాలను అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నట్లు తెలిపారు. యావత్ ప్రపంచం తమ నుంచి ఆశిస్తున్న అన్నింటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఉమ్మడి వ్యూహాలతో ముందుకు రావాలి
కరోనా మహమ్మారి అంతానికి ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాలతో ముందుకు రావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వర్చువల్‌గా మాట్లాడిన జిన్‌పింగ్.. ప్రపంచవ్యాప్తంగా టీకాల పంపిణీ వేగంగా, న్యాయబద్దంగా జరగాలని పేర్కొన్నారు. మరోవైపు ప్రచ్ఛన్న యుద్ధాలకు దారి తీసే వ్యాఖ్యలు చేయటం, ఆ తరహా ఆలోచనలను విరమించుకోవాలని.. అమెరికాను ఉద్ధేశిస్తూ జిన్‌పింగ్ హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఒకరినొకరు నిందించుకోవడం వల్ల అసలు లక్ష్యం నీరుగారే ప్రమాదముందని తెలిపారు. గత వందేళ్లలో ఎన్నడూ చూడని పెను మార్పులను ప్రపంచం ఎదుర్కొందన్న ఆయన ఈ మహమ్మారి నుంచి బయటపడి కొవిడ్ అనంతర ప్రపంచాన్ని ఎలా నిర్మించాలన్న దానిపై ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. అటు అభివృద్ధి చెందిన దేశాలకు బాధ్యతాయుతమైన ఆర్థిక విధానాలు అవసరమన్న జిన్‌పింగ్.. అయితే అవి అభివృద్ధి చెందుతున్న దేశాలను నియంత్రించేలా ఉండరాదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:మరో టీకాపై డీసీజీఐ నజర్- ట్రయల్స్ డేటా పరిశీలన!