కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాలోని వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించడానికి భారత ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్ర సంస్థ సిద్ధమైంది. వీటి తయారీ కోసం తమ డెట్రాయిట్ ఆటో ప్లాంట్‌లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది.
చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మాస్కులు, గౌన్లు, వెంటిలేటర్లు వంటి వైద్య సామగ్రి భారీ సంఖ్యలో అవసరమయ్యాయి. ఈ మహమ్మారిపై పోరాటానికి సాధ్యమైనంత వరకు మిచిగాన్ రాష్ట్ర అధికారులు, తయారీ సంఘాలు తదితరులతో కలిసి పనిచేస్తున్నట్లు మహీంద్ర సంస్థ పేర్కొంది.
మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్.. అమెరికా ఆటోమెటివ్ పరిశ్రమకు నిలయంగా మారిన అతిపెద్ద నగరాల్లో ఒకటి. ప్రస్తుతం కరోనా కేసులు అధికమవ్వడం వల్ల ఈ నగరాన్ని హాట్‌స్పాట్ కేంద్రంగా ప్రకటించింది ప్రభుత్వం. ఏప్రిల్ 14 నాటికి మిచిగాన్‌లో సుమారు 25వేల మంది వైరస్ బారిన పడ్డారు. అమెరికాలో మొత్తం 6 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.