LIC IPO Shares discount: జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ ఆఫ్ ఇండియా) పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది. రిటైల్ విభాగంలో తన పాలసీదారుల కోసం ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతోంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేరు ధరలో 5-10 శాతం రాయితీ సైతం ఇవ్వనున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్ఐసీలో వాటాదారులుగా మారేందుకూ, రాయితీలో షేర్లను దక్కించుకునేందుకు ఏం చేయాలంటే..
మీరు ఎల్ఐసీ పాలసీదారులై, ఐపీఓలో పాల్గొనాలంటే.. మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఎల్ఐసీ పాలసీకి జత చేయాలి. అయితే, పాలసీకి ఆధార్‌నూ జత చేయడం ద్వారా.. ఎల్ఐసీ ఆన్లైన్ వెబ్సైటులో అనేక లావాదేవీలు చేసేందుకు సులువవుతుంది. సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు పాన్ కార్డు తప్పనిసరి కాదు. కానీ, ఎల్ఐసీ తన పాలసీదారులకు షేర్లను కేటాయించేందుకు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటోంది కాబట్టి, ఇప్పుడు అవసరం అవుతోంది.
పాన్‌ను నమోదు చేసేందుకు..
- ముందుగా ఎల్ఐసీ అధీకృత వెబ్సైట్ https://licindia.in/ వెబ్సైటులోకి వెళ్లండి.
- అక్కడ ఆన్లైన్ పాన్ రిజిస్ట్రేషన్ అనే లింకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, అక్కడున్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి.
- అడిగిన వివరాలను నమోదు చేయండి.
- ఓటీపీ ద్వారా వాటిని అధీకృతం చేయండి.
- ఆ తర్వాత మీ పాలసీ- పాన్ అనుసంధానం అయ్యిందా లేదా చూసుకునేందుకూ అక్కడే ఏర్పాటు ఉంది.
- దీనికన్నా ముందు ఎల్ఐసీ వెబ్సైటులో మీ పాలసీ సంఖ్య ఆధారంగా ఆన్లైన్ యూజర్ ఖాతాను సృష్టించుకోండి. దీనివల్ల మీ పని ఇంకా సులభం అవుతుంది.