దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. అయితే జీఎస్‌టీ కౌన్సిల్ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
'పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదనే. అయితే, దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌దే' అని ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ(మహిళా విభాగం) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ ఈ విధంగా మాట్లాడారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా అధికంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ మధ్యే పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.