స్మార్ట్‌ఫోన్ విపణిలో అగ్రరాజ్యం అమెరికాను దాటేసి భారత్ తొలిసారిగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. చైనా తరువాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
2019లో భారత్‌లో 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం.
సత్తా చాటిన చైనా బ్రాండ్స్
భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో చైనా బ్రాండ్‌లు మరోసారి సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా బ్రాండ్‌ల వాటా రికార్డు స్థాయిలో 72 శాతానికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది 60 శాతంగా ఉండేది. చైనా దిగ్గజం షావోమి 28శాతం మార్కెట్ షేర్‌తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత శామ్‌సంగ్ 21 శాతం, వివో 16 శాతం, రియల్‌మీ 10 శాతం, ఒప్పో 9 శాతం వాటా దక్కించుకున్నాయి.
శామ్‌సంగ్‌ను వెనక్కినెట్టిన వివో
2019 నాలుగో త్రైమాసికంలో మాత్రం చైనా సంస్థ వివో రాణించింది. తొలిసారిగా శామ్‌సంగ్‌ను వెనక్కినెట్టి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో వివో మార్కెట్ వాటా 21శాతం ఉండగా.. శామ్‌సంగ్ వాటా 19 శాతానికి పడిపోయింది. 27 శాతం వాటాతో షావోమి తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తన నివేదికలో పేర్కొంది.
ఇదీ చూడండి:2019 నవంబర్‌లో 14.33 లక్షల కొత్త ఉద్యోగాలు