India Overtake Japan Economy: 2030 నాటికి జపాన్‌ను అధిగమించి భారత్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాజా ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక అంచనా వేసింది. అలాగే జర్మనీ, యూకేలను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, యూకే తర్వాత భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉంది.
Indian Economy: 2021లో 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ (నామినల్).. 2030 నాటికి 8.4 ట్రిలియన్ డాలర్లు దాటుతుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుందని తెలిపింది. ఇందుకు అనేక అంశాలు దోహదం చేయనున్నాయని పేర్కొంది. దేశంలో మధ్యాదాయ కుటుంబాలు గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. దీంతో వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని వివరించింది. 2020లో 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న వినిమయ వ్యయం.. 2030 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు పెరగనుందని అంచనా వేసింది.
India GDP: 2020-21లో -7.3 శాతానికి క్షీణించిన భారత జీడీపీ (రియల్).. ఈ ఆర్థిక సంవత్సరం + 8.2 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ అంచనా వేసింది. 2022-23లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ అదే జోరును కొనసాగిస్తూ 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ప్రజల వినిమయ శక్తి పెరగడంతో పాటు దేశీయంగా అనేక పరిశ్రమలు వృద్ధి చెందాయని పేర్కొంది. దీంతో అనేక బహుళజాతి సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపింది.