కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానున్న తరుణంలో.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలకు రవాణా చేసేందుకు హైదరాబాద్ విమానాశ్రయం సంసిద్ధమైంది. కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కీలకంగా మారనుంది. నగరానికి చెందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అభివృద్ధి-తయారీలో నిమగ్నమవ్వగా, బయోలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్, హెటిరో సంస్థలు కూడా టీకాల ఉత్పత్తిలో భాగస్వాములుగా మారనున్నాయి. వివిధ దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను సైతం హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల ద్వారా ఉత్పత్తి చేసి పలు దేశాలకు సరఫరా చేయనున్నారు.
సాధారణంగా వ్యాక్సిన్ రవాణాలో శీతల ఉష్ణోగ్రతలు నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌కార్గో (జీహెచ్‌ఏసీ) వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు అవసరమైన వసతులు సమకూర్చుకుంటోంది. ఇప్పటికే విమానాశ్రయంలో కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. కార్గో టెర్మినల్ ద్వారా -20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో ఉత్పత్తుల తరలించేలా యంత్రాలు సిద్ధం చేశారు. వస్తు రవాణా పార్కింగ్ ప్రాంతాన్ని కార్గో టెర్మినల్ నుంచి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. దీంతో రవాణాకు ఇబ్బంది ఉండదు.
ఉష్ణోగ్రతల్లో మార్పురాకుండా
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను కొనసాగిస్తూ వస్తు రవాణా కోసం కూల్ డాలీ అనే ట్రాలీ యంత్రాన్ని జీహెచ్‌ఏసీ అధికారులు గత సెప్టెంబరులోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. మొబైల్ రిఫ్రిజిరేషన్ యూనిట్‌గా ఇది ఉపయోగడుతుంది. దీని ద్వారా వ్యాక్సిన్లు, ఇతర ఔషధ ఉత్పత్తుల రవాణా సలువవుతుంది.