విజయం ఊరికే వరించదు. అందుకు పట్టుదల ఒక్కటే సరిపోదు. చేసే పనిలో సృజనాత్మకత ఉండాలి. కొత్త కోణాన్ని ఆవిష్కరించాలి. అప్పుడే ఎంచుకున్న రంగంలో రాణించగలుగుతాం. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన 39 ఏళ్ల దీప్‌మాలా చేసిందీ ఇదే! ఉద్యోగ అనుభవాన్ని వ్యాపార సూత్రంగా మలుచుకొని అద్భుతాలకు కేరాఫ్‌గా మారింది. దిల్లీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ మీడియాలో రేడియో అండ్ టీవీ జర్నలిజంలో డిప్లొమా చేసిందామె. తర్వాత ఓ ప్రైవేట్ మీడియా సంస్థలో ఉద్యోగంలో చేరింది. చిన్నచిన్న కథనాలను కూడా ఆసక్తికరంగా రాయడం, వీడియోలను అందంగా ఎడిటింగ్ చేయడం, పలు కార్యక్రమాలకు తానే దర్శకత్వం వహించడం.. ఇలా ఆల్ ఇన్ వన్ అనిపించుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ప్రకటనల రూపకర్తగా కొత్త అవతారం ఎత్తింది..
బాస్ అనిపించుకుంది..
ఉద్యోగం మానేసిన తర్వాత... సొంతంగా ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. పదివేల రూపాయల పెట్టుబడితో ‘ద విజువల్ హౌస్’ సంస్థను ప్రారంభించింది. ‘చిన్నప్పటి నుంచి బాస్‌గా మారాలని ఉండేది. అందుకే సొంతంగా సంస్థను స్థాపించాన’ని చెబుతుంది దీప్‌మాలా. బంధువును అడిగి ల్యాప్‌టాప్ తీసుకుంది. చిన్న గది నుంచి వ్యాపార ప్రస్థానం మొదలుపెట్టింది. తొలి ప్రయత్నంగా ప్రకటన సంస్థలకూ, ఎన్జీవోలకు ఫోన్లు చేసింది. ఎవరూ స్పందించలేదు. రోజులు గడిచిపోయాయి. ఒకరోజు దిల్లీకి చెందిన ‘యాక్షన్ ఫర్ ఆటిజం’ అనే సామాజిక సేవా సంస్థ నుంచి దీప్‌మాలాకు పిలుపొచ్చింది. ఆటిజంపై ఓ డాక్యుమెంటరీ చేసివ్వమన్నారు. ‘డాక్యుమెంటరీ బాగా రావాలని కొన్ని రోజులు ఆటిజం ఉన్న చిన్నారులతో గడిపాను’ అంటుంది దీప్‌మాలా. అలా తొలి ప్రాజెక్ట్‌తోనే ప్రశంసలు అందుకుని నిలదొక్కుకుందామె. మెల్లమెల్లగా ప్రకటనలు, డాక్యుమెంటరీల కోసం పలు సంస్థలు సంప్రదించడం మొదలైంది. చిన్నప్పటి నుంచి కోరుకున్నట్టుగా దీప్‌మాలా 25 మందికి ఉపాధినిచ్చి బాస్ అని పిలిపించుకుంది.