పెట్టుబడి, వ్యాపార వర్గాల్లో ఆయనంటే లియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనే వారెన్ బఫెట్ (Warren Buffett). సోమవారం (ఆగస్టు 30) ఆయన పుట్టిన రోజు(Warren Buffett birthday). ఈ సందర్భంగా బఫెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Warren Buffett Interesting facts) ఇప్పుడు తెలుసుకుందాం.
- వారెన్ బఫెట్ 1930 ఆగస్టు 30న జన్మించారు. సోమవారం ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు.
- 1936లో అంటే ఆయనకు ఆరేళ్ల వయసున్నప్పుడు చూయింగ్ గమ్ ప్యాకెట్స్, కోకో కోలా బాటిల్స్ అమ్మడం, మ్యాగజైన్లు వేయడం వంటి పనులు చేసి డబ్బులు సంపాదించే వారు.
- ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి. అలా పెట్టుబడులకు సంబంధించిన పుస్తకాలు చదివి.. చిన్నప్పుడే తన గమ్యాన్ని నిర్ణయించుకున్నారు.
- 11 ఏళ్ల వయస్సులో తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు బఫెట్. అయితే.. అప్పటికే చాలా ఆలస్యం చేశానని ఇప్పటికే చెబుతుంటారు.
- అమెరికాకు చెందిన ప్రఖ్యాత బహుళజాతి సంస్థ బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
- బెర్క్‌షైర్ హాత్వేకు యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, కోకా కోలా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.
- శీతల పానీయాల సంస్థ కోకా కోలా వారెన్దే అని చాలా మంది అనుకుంటారు. నిజానికి ఆ సంస్థకు ఓనర్ అంటూ ఎవరూ లేరు. వేలాది మంది పెట్టుబడిదారులే ఈ కంపెనీకి యజమానులు. అయితే ఈ కంపెనీలో అత్యధిక వాటా ఉన్న వ్యక్తి (9.3 శాతం) వారెన్ బఫెట్.
- బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం బఫెట్ సంపద 104 బిలియన్ డాలర్లు
- బఫెట్ సంపదలో 90 శాతానికిపైగా ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాత సంపాదించిందే.
- సంపాదించడంలోనే కాదు.. దాతృత్వంలోనూ ఆయనకు ఆయనే సాటి. బెర్క్‌షైర్ హాత్వేలో ఆయనకున్న సంపదలో 85 శాతం ఛారిటబుల్ ట్రస్టులకు విరాళంగా ఇచ్చారు.
- హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునేందుకు వారెన్ బఫెట్ దరఖాస్తు చేసుకోగా.. దానిని ఆ యూనివర్సిటీ తిరస్కరించింది.
- 1958 నుంచి ఇప్పటి వరకు.. ఆయన ఒకే ఇంట్లో ఉంటున్నారు.
- ఆయనతో ఒక్క పూట కలిసి భోజనం చేసేందుకు మిలియన్ల డాలర్లు వెచ్చిస్తుంటారు చాలా మంది.
- తన ఆస్తిలో ఎక్కువ భాగం తన పిల్లలకు ఇవ్వడంలో అర్థం లేదని అభిప్రాయపడుతుంటారు బఫెట్. తెలివైన తండ్రి ఎప్పుడు ఆస్తి మొత్తాన్ని పిల్లలకు ఇవ్వడని చెబుతుంటారు. పిల్లల్లో కేవలం తాము ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాశాన్ని పెంపొందించాలని సూచిస్తుంటారు.
- సుదీర్ఘ కాలం పాటు వాడిన శాంసంగ్ ఫ్లిప్ ఫోన్‌ను పక్కన పెట్టి.. 2020లో యాపిల్ ఐఫోన్ 11ను కొనుగోలు చేశారు బఫెట్. యాపిల్ కంపెనీలో బఫెట్‌కు దాదాపు 5.6 శాతం వాటా ఉంది. దీని విలువ 70 బిలియన్ డాలర్ల పైమాటే.