తెలంగాణ

telangana

ETV Bharat / business

GST Petrol news: 'జీఎస్‌టీలోకి పెట్రో ఇప్పుడే కాదు'

gst meeting
నిర్మల

By

Published : Sep 17, 2021, 8:26 PM IST

Updated : Sep 18, 2021, 7:36 AM IST

20:24 September 17

GST Petrol news: 'జీఎస్‌టీలోకి పెట్రో ఇప్పుడే కాదు'

జీఎస్​టీ(GST Council Meeting) పరిధిలోకి పెట్రోల్ (GST Petrol news​), డీజిల్​ను చేరిస్తే.. పెరుగుతున్న ధరలతో కాస్త ఉపశమనం లభిస్తుందనుకున్న ప్రజలకు నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన 45వ జీఎస్​టీ సమావేశంలో(GST Council Meeting Today) దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. జీఎస్​టీలోకి పెట్రో ధరలను(GST Petrol newsః తెచ్చేందుకు ఇది సమయం కాదని మండలిలోని సభ్యులు భావించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman News) వెల్లడించారు. 

మినహాయింపు..

కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్​టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. రూ. 16 కోట్లు విలువైన ఔషధాలకు మినహాయింపు ఉంటుదని పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు కరోనా సంబంధిత ఔషధాలపై జీఎస్​టీ రాయితీ ధరలు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆహార డెలివరీ యాప్‌లపై 5% పన్ను విధించినా, వినియోగదారులపై అదనపు భారం పడదని స్పష్టం చేశారు.

పెట్రోలియం ఉత్పత్తులపై

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వంటి ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి (GST Petrol news) తేవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ మేరకు, ఈ అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు జీఎస్‌టీ కౌన్సిల్‌కు(GST council news) సూచించింది.  దీనిపై చర్చించినా, అనేక రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపలేదని, ప్రభుత్వాల ఆదాయాలపై ప్రభావం పడే వీలుండటమే ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి తెలిపారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇది సమయం కాదని కేరళ హైకోర్టుకు తెలియజేస్తామన్నారు. 

వచ్చే జూన్‌ వరకే పరిహారం

జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలకు ఏర్పడుతున్న ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు, విలాస, హానికారక ఉత్పత్తులపై సెస్‌ విధిస్తున్నారు. ముందుగా నిర్ణయించినట్లు 2017 జులై నుంచి అయిదేళ్ల పాటు అంటే.. 2022 జూన్‌ వరకే రాష్ట్రాలకు ఈ పరిహారం చెల్లిస్తారు. అయితే సెస్‌ వసూలు మాత్రం 2026 మార్చి వరకు కొనసాగిస్తారు. 2020-21 నుంచి కొవిడ్‌ కారణంగా ఏర్పడిన ఆదాయనష్టాన్ని భర్తీ చేసుకోడానికి బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకున్న రాష్ట్రాలు, వాటిని తీర్చేందుకు ఈ నిధి అందిస్తారు. 2022 జులై తర్వాత నుంచి 2026 మార్చి వరకు పరిహారసెస్‌ నుంచే ఈ అప్పులను రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంటుంది.

ఔషధాలపై

కండరాల క్షీణత చికిత్సకు ఉపయోగించే జోల్‌జెన్‌స్మా, విల్‌టెప్సో మందులకు పూర్తిగా జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. వీటి ధరలు రూ.16 కోట్ల దాకా ఉంది.కేంద్ర వైద్యఆరోగ్యశాఖ, ఫార్మాస్యూటికల్‌ శాఖ ప్రతిపాదించే కండరాలక్షీణత మందులను దిగుమతి చేసుకునేటప్పుడు ఐజీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇస్తామన్నారు.

  • కొవిడ్‌ మందులపై ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను సెప్టెంబరు 30నుంచి డిసెంబరు 31వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. యాంఫోటెరిసిన్‌బి , తొసిజిలుమాబ్‌లపై 0%, రెమ్‌డెసివిర్‌, యాంటీకాగులెంట్స్‌లపై 5% పన్ను డిసెంబరు 31 వరకు కొనసాగుతాయన్నారు. పరికరాలకు మాత్రం పన్నురాయితీ పొడిగింపు లేదన్నారు.
  • మరో ఏడు ఔషధాలపై ప్రస్తుతం అమలుచేస్తున్న పన్నురాయితీ (12% నుంచి 5%) డిసెంబరు 31 వరకు వర్తిసుందన్నారు.
  • కేన్సర్‌ సంబంధ కేట్రుడాతో పాటు మరికొన్ని మందులపై జీఎస్‌టీని 12% నుంచి 5%కి తగ్గించినట్లు చెప్పారు.
  • దివ్యాంగులు వ్యక్తిగతంగా ఉపయోగించే వాహనాలకు వాడే రెట్రోఫిట్‌మెంట్‌పై పన్ను 5 శాతానికి తగ్గించినట్లు తెలిపారు.
  • ఐసీడీఎస్‌లో వాడే ఫోర్టిఫైడ్‌ రైస్‌కర్నల్‌పై 18% నుంచి 5%కి తగ్గించినట్లు తెలిపారు.
  • చమురు సంస్థలకు డీజిల్‌లో కలపడానికి సరఫరా చేసే బయోడీజిల్‌పై పన్ను 12% నుంచి 5%కి తగ్గించినట్లు చెప్పారు.
  • సర్వీసు కేటగిరీలో జాతీయ వస్తు రవాణా వాహనాలకు రాష్ట్రాలు ఇచ్చే జాతీయ పర్మిట్‌ ఫీజును జీఎస్‌టీ నుంచి మినహాయించినట్లు చెప్పారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు పూర్తి పన్ను మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.  ప్రభుత్వాలు 75% నిధులు సమకూర్చి, శిక్షణార్థులు మిగిలిన మొత్తం చెల్లించే శిక్షణ కార్యక్రమాలకూ పన్ను మినహాయింపు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు.
  • పెన్నులపై ఇప్పుడు 12, 18% జీఎస్‌టీ అమలవుతుండగా.. ఇకపై 18% అమలవుతుంది.
  • లీజుకు దిగుమతి చేసుకునే ఎయిర్‌క్రాఫ్ట్‌లపై ఐజీఎస్​టీని మినహాయించారు.

రెస్టారెంట్ల బదులు ఫుడ్‌ యాప్‌లు వసూలు చేయాలి

జొమాటో, స్విగ్గీలాంటి యాప్‌ ఆధారిత ఫుడ్‌ అగ్రిగేటర్లు రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను సేకరించి వినియోగదారులకు సరఫరా చేస్తారు. ఎక్కడైతే ఆహారం అందిస్తారో, అక్కడినుంచే ఈ యాప్‌లు పన్ను వసూలుచేస్తాయి కాబట్టి ఆ సంస్థలే జీఎస్‌టీ చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అందువల్ల ఇకపై ఈ యాప్‌లు 5 శాతం వసూలు చేసి, ప్రభుత్వానికి జమచేయాల్సి ఉంటుంది. రెస్టారెంట్ల బదులు వీరు చెల్లిస్తారే కానీ, అదనపు పన్ను కాదని, అందువల్ల వినియోగదార్లపై భారం పడదన్నారు. పన్ను  ఎగవేతను పరిహరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇవీ చూడండి:సామాన్యుడిపై మళ్లీ 'పెట్రో' భారం- పెరగనున్న ధరలు!

'ఓలా ఎలక్ట్రిక్​' రికార్డ్- 2 రోజుల్లో రూ.1,100 కోట్ల విక్రయాలు

Last Updated : Sep 18, 2021, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details