భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు విత్త మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయంతో ఆర్థిక శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. చర్చలు పూర్తయిన వెంటనే నివారణ చర్యలను ప్రభుత్వం సూచిస్తుందన్నారు.
ఆర్థిక మందగమన నేపథ్యంలో ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించనుందా? అన్న ప్రశ్నకు సమాధానమివ్వలేదు నిర్మలాసీతారామన్. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వంటి అన్ని రంగాల ప్రతినిధులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నామన్నారు.
"గత సోమవారం నుంచి పలుమార్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎస్ఎంఈలు, పరిశ్రమలు, ఆటోమొబైల్ రంగాల ప్రతినిధులతో సమావేశమయ్యాం. వారి సమస్యలను తెలుసుకున్నాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో విశ్లేషిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గురువారం భేటీ అయ్యాం. మేం భారీ ప్రోత్సాహకాల గురించి మాట్లాడటం లేదు. మీడియాలో వస్తున్న విషయాలు నేను చెప్పినవి కావు. ఏ చర్యలు తీసుకోవాలో చర్చలు జరుగుతున్నాయి. పూర్తయిన వెంటనే ప్రకటిస్తాం. "