అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరగనుందా..? ప్రస్తుతం ఏం జరుగుతోంది... ఇరు దేశాల మధ్య ఇంత ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులేంటి ...? ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే చర్చ. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే యావత్ ప్రపంచంపై ఆ ప్రభావం పడుతుంది. చమురు ధరలు భారీగా పెరుగుతాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య గొడవ ఎప్పుడు మొదలైంది? ఆంక్షల నుంచి ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన పరిణామాలేంటి...?
అలా మొదలైంది..
అమెరికా- ఇరాన్‌ల మధ్య జగడం గతేడాది మొదలైంది. 2015లో జరిగిన ఇరాన్ అణు ఒప్పందం నుంచి బయటికి రావాలని 2018, మే8న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ట్రంప్ అభిప్రాయాన్ని చాలా దేశాలు తీవ్రంగా విమర్శించాయి. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. గతేడాది ఆగస్టు 7న ఇరాన్‌పై ఆంక్షల దాడిని ప్రారంభించింది అగ్రరాజ్యం. ఆర్థిక పరంగా ఇరాన్‌ను దెబ్బతీయాలని నిశ్చయించుకుంది.
చమురుపై ఆంక్షలు
ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీసే చర్యలను గతేడాది నవంబర్ 5న ప్రారంభించింది అమెరికా. ఆ దేశం నుంచి చమురు ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇరాన్ నుంచి ముడి చమురు కొంటే ఆ దేశంపైనా ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ చర్యలతో ఇరాన్ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రపంచ దేశాలపైనా ఈ ప్రభావం పడి.. చమురు ధరలు పెరగడం ప్రారంభించాయి. అయితే కొన్ని దేశాలకు మినహాయింపునిచ్చింది అమెరికా.
ఇరాన్‌కు చెందిన శక్తిమంతమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ క్రాప్' సంస్థను ఈ ఏడాది ఏప్రిల్ 8న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జాబితాలో అమెరికా చేర్చడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.