తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత ఎన్నారైలదేనన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తెరాస ఎన్నారైల ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. రైతు కళ్లలో సంతోషాన్ని, చిరునవ్వును చూడాలన్నదే కేసీఆర్ విజన్ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఎన్నారైల ఆతిథ్యం, ఆత్మీయత చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నట్టు అనిపిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వచ్చే రెండేళ్లలో రైతుల కళ్లలో సంతోషం...
2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాకు వచ్చిన సందర్భంలో 10 రోజుల్లో 14రాష్ట్రాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం 2019 ట్యాంపాలోనే అందరిని కలిసానని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రైతుల కష్టాలు పోయి వారి కళ్లలో సంతోషాన్ని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ దేశానికి రోల్ మోడల్...
అభివృద్ధి అంటే ఒకప్పుడు బంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఉండేవని ప్రస్తుతం తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తూ... మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు.