HYBRID VEHICLES: చిన్నప్పటి నుంచి కటిక పేదరికంలో పెరిగాడు. ఇంట్లో అంతా పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో బడికి స్వస్తి పలికి, పనికి కుదిరాడు ఈ నెల్లూరు యువకుడు. అలా చిన్నప్పటి నుంచి దొరికిన పని చేస్తూ జీవనం సాగించాడు. ఆ డబ్బులు సరిపోకపోవడంతో తన మేధకు పదునుపెట్టి పెట్రోల్, బ్యాటరీలతో నడిచే హైబ్రిడ్ వెహికిల్స్ రూపకర్తగా మారి వ్యాపారం చేస్తున్నాడు. అతడే సాయి కుమార్..
నెల్లూరులో మెకానిక్ సాయి అంటే తెలీని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అక్కడి యువతలో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. అందరిలాగా కాక కొత్తగా ఆలోచించి వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఈ యువకుడు. కఠిక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు సొంతకాళ్లపై నిలబడగలిగే స్థాయికి చేరుకున్నాడు.
మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్ అందుబాటులోకి వచ్చాక క్రమంగా వాటి వినియోగదారుల సంఖ్య పెరిగింది. కానీ వాటిల్లో చిన్నచిన్న అవరోధాలు ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. వాటిల్లో ప్రధానమైనది ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న. అందుకు సమాధానంగానే అత్యవసర పని పడితే ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ వెహికిల్ బ్యాటరీ కెపాసిటీ పెంచాలనే ఆలోచన పుట్టిందంటున్నాడు సాయి కుమార్.
"పెట్రోల్+బ్యాటరీతో నడిచే వాటిని హైబ్రిడ్ వెహికల్ అంటారు. చైనా నుంచి వచ్చిన బండ్లకు స్పేర్ పార్ట్స్ తొందరగా దొరకవు. మరీ ముఖ్యంగా రేంజ్ అనేది తక్కువ ఉంటుంది. అందుకే రేంజ్ పెంచాలనుకుని వీటిని తయారు చేస్తున్నా. అలా తయారు చేస్తుండగా హైబ్రిడ్ వెహికిల్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. పెట్రోల్‌తో నడవడంతో పాటు బ్యాటరీ స్పేర్‌లో ఉంటుంది. పెట్రోల్ అయిపోతే బ్యాటరీ.. బ్యాటరీ అయిపోతే పెట్రోల్ ఇలా దేనితో నైనా నడిపే విధంగా రూపొందించా" -సాయి కుమార్, హైబ్రిడ్ వెహికిల్ తయారీదారుడు
అలా బ్యాటరీ రేంజ్ పెంచిన తర్వాత హైబ్రిడ్ వెహికిల్ చేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతున్నాడు ఈ యువకుడు. అలా చేయడం ద్వారా పెట్రోల్‌తో వెళ్లే వారు బ్యాటరీని స్పేర్‌గా ఉంచుకుని వెళ్లొచ్చని, మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది తయారు చేశానని చెబుతున్నాడు.